01-07-2025 11:16:13 PM
తహసీల్దార్ కార్యాలయం ముందు టపాసులు కాల్చిన రైతులు...
తలకొండపల్లి: డబ్బుల కోసం రైతులను పీడించిన తహసీల్దార్ నాగార్జున(Tahsildar Nagarjuna) ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో మంగళవారం రాత్రి రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తలకొండపల్లి మండల తహసీల్దారుగా నాగార్జున సంవత్సరం క్రితం బాధ్యతలు తీసుకున్నారు. విధులలో చేరిననాటి నుండే కార్యాలయ సిబ్బంది ద్వారా లంచాలకు తెరలేపారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ఫైల్ కదలాలన్నా లంచాల రూపంలో డబ్బులు ముట్టజెప్పనిదే ఫైలు ముందుకు కదిలేది కాదని ఇక్కడ బహిరంగ రహస్యమే అంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బుల వసూలుకు ప్రత్యేకంగా కార్యాలయం బయట కొంత మంది దళారులను తహసిల్దారు నియమించుకున్నట్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా లంచావతారం అవినీతి నిరోధక శాఖక అధికారులకు పట్టు బడడంతో పీడ విరగడైందని మండల రైతులు సంబరాల్లో మునిగిపోయారు.