calender_icon.png 2 July, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి

01-07-2025 11:05:01 PM

విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలి...

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. 

కరీంనగర్ (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాలని, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ కరీంనగర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెడదోవపట్టకుండా చూడాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. రానున్న రోజుల్లో మాదకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ... మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, అవసరమైతే డాగ్ స్క్వాడ్ వినియోగిస్తామని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 13 కేసులు నమోదు చేశామని 13.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విద్యార్థులు పెదదోవ పెట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైన ఎంతగానో ఉందన్నారు.

బాలలను తల్లిదండ్రుల చెంతకు చేర్చండి 

బాల బాలికలను పని నుండి విముక్తి కల్పించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ఆపరేషన్ ముస్కాన్  లో భాగంగా అన్ని పని ప్రదేశాలలో బాల బాలికలను గుర్తించాలని, వారికి పని నుండి విముక్తి కల్పించాలని అన్నారు. జిల్లాలోని చిన్న పరిశ్రమలు, హోటళ్ళు, ఇటుక బట్టీలు, క్వారీలు తదితర ప్రదేశాల్లో శిశు సంక్షేమ, కార్మిక శాఖ అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో  నిరంతరం తనిఖీలు చేయాలని అన్నారు. 

ముఖ్యంగా గృహ కార్మికులుగా పిల్లలను నియమించుకుంటున్నారని, నివాస ప్రాంతాల్లోనూ, అపార్ట్మెంట్లలోనూ తనిఖీలు చేపట్టాలని అన్నారు. పని నుండి విముక్తి కల్పించిన పిల్లలను వారి తల్లిదండ్రులు చెంతకు చేర్చాలని, గతంలో పని నుండి విముక్తి కల్పించిన పిల్లలు ప్రస్తుతం ఎటువంటి స్థితిలో ఉన్నారో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలను ఆపరేషన్ ముస్కాన్ లో గుర్తిస్తే వారిని జిల్లా బాలల పరిరక్షణ కమిటీ వద్ద ప్రవేశపెట్టి ప్రభుత్వ బాలల పరిరక్షణ కేంద్రాల్లో చేర్చాలని అన్నారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్  కు సంబంధించిన పోస్టర్ లను ఆవిష్కరించారు.  ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో  మహేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇన్చార్జి డి.డబ్ల్యు.ఓ  సబిత, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డీఈఓ మొండయ్య, డిసిపిఓ పర్విన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.