20-08-2025 07:21:54 PM
నంగునూరు: వయోజనులను అక్షరాస్యులుగా మార్చి, దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే ఉల్లాస్పథకం ప్రధాన లక్ష్యమని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉల్లాస్ పథకంపై ఉపాధ్యాయులు, వీవోఏ సభ్యుల కోసం ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ దేశిరెడ్డి మాట్లాడుతూ... 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 25.76 కోట్ల మంది వయోజనులు (16.68 కోట్ల మంది మహిళలు, 9.08 కోట్ల మంది పురుషులు) నిరక్షరాస్యులుగా ఉన్నారని వివరించారు.
2009-10 నుంచి 2017-18 వరకు అమలైన సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా 7.64 కోట్ల మంది అక్షరాస్యులుగా మారారని, అయినప్పటికీ ఇంకా 18.12 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.