19-12-2025 12:00:00 AM
ఇంటి నుండే రైతులు యూరియా బుకింగ్ చేయవచ్చు
ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీలర్లకు, ఏ ఈ ఓ లకు అవగాహన :-
హాజరైన జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూప రాణి
గజ్వేల్, డిసెంబర్ 18 : ఎరువుల క్రయవిక్రయాల్లో పారదర్శకతతో పాటు, రైతులకు ఎరువుల కొనుగోలు మరింత సౌకర్యవంతంగా చేయడానికి యాప్ ద్వారా రైతులే ఇంటి నుండి నేరుగా బుకింగ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపారాణి అన్నారు. జిల్లావ్యాప్తంగా ఎరువుల డీలర్లకు, ఏఈఓ లకు వ్యవసాయ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎరువుల బుకింగ్ యాప్ గురించి గురువారం అవగాహన కల్పించారు.
గజ్వేల్ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం ప్రసంగించారు. యాప్ ద్వారా రైతులు ఎరువులను ఇంటి నుండే బుకింగ్ చేసుకోవచ్చని, బుకింగ్ చేసుకున్న 24 గంటల లోపు రైతులు ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. లేనిపక్షంలో మళ్లీ బుకింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఎకరానికి మూడు బస్తాలు చొప్పున బుకింగ్ చేసుకున్న రైతు రెండు విడతల్లో యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు.
ఎకరం లోపు భూమి ఉన్న రైతులు ఒకేసారి మూడు బస్తాల యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. ఎరువుల డీలర్లు తమ దుకాణాలకు వచ్చే రైతులకు, గ్రామాలలో రైతులకు, యువతకు, విద్యావంతులకు ఏఈవోలు యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు.
ఈనెల 20వ తేదీ నుండి యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ ప్రారంభం కానున్నదని ఈ విషయాన్ని రైతులందరికీ వివరించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, డీలర్లు, ఏఈవోలు పాల్గొన్నారు. ములుగు రైతు వేదికలో ఏడీఏ అనిల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.