14-11-2025 01:25:36 AM
నిబంధనలు మీరితే వాహనాలు సీజ్
యజమానుల తాట తీస్తాం: డిప్యూటీ కమిషనర్
మణికొండ, నవంబర్13, విజయక్రాతి : ఇరవై మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనతో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఓవర్‌లోడ్‌తో మృత్యుశకటాల్లా దూసుకొస్తున్న టిప్పర్ల ఆటకట్టించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ సదానందం ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
అనువణువునా తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించిన లోడుతో రోడ్డెక్కుతున్న వాహనాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాహనాలను ఆపి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్‌లతో పాటు వెయింగ్ స్లిప్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని, నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను ఎక్కడికక్కడ సీజ్ చేసి, యజమానులకు, డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు.
ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించం: డిప్యూటీ కమిషనర్
వాహన తనిఖీలపై డిప్యూటీ కమిషనర్ సదానందం సీరియస్‌గా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్రాలు లేకుండా తిరిగే వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామన్నారు. పన్ను చెల్లించని వాహనాల నుంచి 200 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.
“నిత్యం తనిఖీలు చేస్తున్నా కొంతమంది తీరు మారడం లేదు. ఓవర్‌లోడ్‌తో వాహనాలు నడపడం నేరం. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు. నిబంధనలు మీరితే యజమానుల తాట తీస్తాం” అని ఆయన హెచ్చరించారు. క్రషర్ల వద్దే కట్టడి చేయాలి ప్రమాదాల నివారణకు మైనింగ్, రెవెన్యూ అధికారులు సైతం సహకరించాలని సదానందం కోరారు.
లారీలు ఎక్కడి నుంచి మెటీరియల్ తెస్తున్నాయో, అక్కడే ఓవర్‌లోడ్‌ను నియంత్రించాలన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు క్రషర్ మిషన్లపై దృష్టి సారించి, ఓవర్‌లోడ్ లోడింగ్ జరగకుండా చూడాలని ఆయన సూచించారు.