calender_icon.png 24 October, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్ లో శిక్షణ పొందిన గిరిజన యువకులు జీవితంలో స్థిరపడాలి

23-10-2025 08:02:38 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): నిరుద్యోగులైన గిరిజన యువకులు ఐటీడీఏ వైటిసి ద్వారా ఎల్ ఎం వి, వరంగల్ జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కాలేజ్ లో హెచ్ఎంవి డ్రైవింగ్ శిక్షణ తీసుకున్న వారు శిక్షణ పూర్తి అయిన తర్వాత సమయాన్ని వృధా చేయకుండా వివిధ సంస్థలను సంప్రదించి డ్రైవర్ ఉద్యోగాలు పొంది తమ కుటుంబాన్ని పోషించుకొని జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యువకులకు సూచించారు. 

గురువారం నాడు తన ఛాంబర్ లో జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కాలేజ్ టి ఎస్ ఆర్ టి సి వరంగల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకున్న గిరిజన యువకులను హెచ్ ఎం వి డ్రైవింగ్ శిక్షణ ఏ విధముగా నేర్చుకున్నది యువకులను అడిగి తెలుసుకుని వారికి శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్లు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నెల రోజులపాటు వైటిసిలో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని, హెచ్ఎంవి శిక్షణ వరంగల్ లో తీసుకున్నందున డ్రైవింగ్ ఏ విధంగా చేయాలో పూర్తిగా అవగతం చేసుకొని ఉంటారని, కానీ పూర్తిస్థాయిలో డ్రైవింగ్ నేర్చుకున్న గిరిజన యువకులకు భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలంలో ఆర్టీవో ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు అందించడానికి కృషి చేస్తానని ఆ లైసెన్సులను సద్వినియోగం చేసుకొవాలని అన్నారు.

ఎక్కువ శాతం డ్రైవర్ ఉద్యోగాలు విమానాశ్రయాలు, నవత ట్రాన్స్పోర్ట్  సింగరేణి బొగ్గు గనులలో తప్పనిసరిగా డ్రైవర్లు అవసరం పడతారని, అటువంటి సంస్థల ప్రతినిధులను సంప్రదించి ఉద్యోగాలు పొందాలని అన్నారు. రెండు మూడు నెలల్లో మీరు తప్పనిసరిగా ఏదో ఒక కంపెనీలో డ్రైవర్ ఉద్యోగాలలో పనిచేస్తున్నట్లు తన దృష్టికి రావాలని, డ్రైవర్ ఉద్యోగాలు పొందిన తర్వాత మీ వ్యక్తిగత రక్షణతో పాటు ప్రజల రక్షణ మరియు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదని, డ్రంకన్ డ్రైవ్ కు దూరంగా ఉండాలని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వేరే గిరిజన యువకులు డ్రైవర్ శిక్షణ తీసుకొని జీవనోపాధి పెంపొందించుకుంటామని మక్కువ చూపించి ముందుకు వస్తే తప్పకుండా వారికి డ్రైవింగ్ శిక్షణ అందించి వారు కూడా జీవితంలో స్థిరపడే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజన యువకులు తదితరులు పాల్గొన్నారు.