calender_icon.png 24 October, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు పాటించాలి

23-10-2025 08:06:42 PM

విద్యుత్ శాఖ ఏఈ ఉమారావు..

మణుగూరు (విజయక్రాంతి): భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రమాదాలను నివారిద్దామని విద్యుత్‌ వినియోగదారులకు మండల విద్యుత్ శాఖ ఏఈ బియాని ఉమారావు సూచించారు. గురువారం ఆయన విజయక్రాంతితో మాట్లాడారు. భారీ వర్షాలు, గాలులు ఉన్నపుడు విద్యుత్‌ ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల సమయంలో గృహోపకరణాల స్విచ్‌లను ఆఫ్‌మోడ్‌లోనే ఉంచాలని కరెంటు బోర్డులో స్విచ్‌లను తడి చేతులతో ఆన్‌, ఆఫ్‌ చేయరాదన్నారు. వర్షం పడుతున్నపుడు విద్యుత్‌ స్తంబాలు, స్టే వైర్లను ముట్టుకొనరాదని, ఇంటి పరిసరాలలో చెట్లు, కరెంటు పోల్స్‌ పడినా, వాలినా, కరెంటు వైర్లు తెగినా వెంటనే విద్యుత్‌ కార్యాలయం లేదా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. గాలి వాన సమయంలో కరెంటు లైన్‌ కింద ఉండరాదని సూచించారు.

మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వల్ల నీటిలో మునిగినా, పూర్తిగా తడిసినా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇళ్లు, భవన నిర్మాణాల సమయంలో నిర్మాణదారులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు తమ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు అంతర్గత వైరింగ్‌కు నాణ్యత కలిగిన విద్యుత్‌ వైర్లు, స్విచ్‌లు, పరికరాల్ని వాడడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఇళ్లలోని స్విచ్‌ బోర్డులను పిల్లలకు అందనంత ఎత్తులో అమర్చుకోవాలని, తప్పనిసరిగా ఎర్త్‌ పైప్‌ ద్వారా ఎర్తింగ్‌ ఏర్పాటు చేసి ప్రమాదాల్ని అరికట్టవచ్చన్నారు. డాబాలపైన దుస్తులు ఆరవేసేటప్పుడు, ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో సమీపాన విద్యుత్‌ వైర్లు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం తనను 8712486075 నెంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు. లేదా విద్యుత్ శాఖ టోల్‌ ఫ్రీ నెంబరు 1912 కు తెలియజేయాలన్నారు.