calender_icon.png 23 May, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షంతో అతలాకుతలం

22-05-2025 01:01:51 AM

  1. మానుకోట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు బలి 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం 

మహబూబాబాద్, మే 21 (విజయ క్రాంతి): అకాల వర్షంతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ఇప్పటికే కొని ఎగుమతికి నిల్వచేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ళు దాదాపు పూర్తిగా వచ్చే పరిస్థితి ఉండగా, వర్షంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.

ధాన్యం ఎగుమతికి కూడా కష్టంగా మారింది. వాహనాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లడానికి ఆటంకంగా మారింది. దీనితో రైతులు ధాన్యం అమ్మకానికి మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కురవి, సీరోల్, మరిపెడ, మహబూబాబాద్, కేసముద్రం తదితర మండలాల్లో జోరువాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

పిడుగుపాటుకు ఇద్దరు బలి..

మహబూబాబాద్ జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ కుమార్ (27) బహిర్భూమికి వెళ్లి వస్తుండగా పిడుగు పడడంతో మరణించాడు. అలాగే కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన దేశ బోయిన చేరాలు (55) పిడుగుపాటుకు బలయ్యాడు.