calender_icon.png 15 July, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ మహరాజు!

20-06-2025 12:00:00 AM

నోబెల్ శాంతి బహుమతి సాధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నానా అవస్థలు పడుతున్నట్టు కనిపిస్తున్నది. భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగించినప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య తన చొరవవల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. కాదు, పాకిస్థాన్ మిలటరీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు, బయటి దేశాల మధ్యవర్తిత్వం లేకుండానే కాల్పుల విమరణకు అంగీకరించామని భారత్ పలుమార్లు స్పష్టంచేసింది. అయినా, ట్రంప్ తన ధోరణి మార్చుకోలేదు.

చివరికి, కెనడాలో జీ వేదిక నుంచి తనకు ఫోన్ చేసిన ట్రంప్‌కు ప్రధాని మోదీ విషయం స్పష్టంచేశారు. అయినా కొద్ది గంటలలోనే ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. పాకిస్థాన్ సైనిక దళాల అధిపతి సయ్యద్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ బుధవారం సమావేశమయ్యారు. లంచ్ కూడా ఇచ్చారు. ఒక దేశాధ్యక్షుడు, మరో దేశం సైనికాధికారిని ఇలా కలుసుకోవచ్చా? అలాంటి ప్రొటోకాల్ ఉంటుందా అనేది వేరు ప్రశ్న.

ట్రంప్‌కు ఏ ప్రొటోకాల్ వర్తించక పోవచ్చు. మునీర్‌తో ట్రంప్ ఎందుకు సమావేశమయ్యారు? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన సందర్భంగా పాకిస్థాన్ మద్దతును అమెరికా కూడగడుతున్నదనడంలో సందేహమే లేదు. అందుకే, మునీర్‌తో ట్రంప్ సమావేశమైనట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడ వైట్‌హౌజ్ ప్రతినిధి చేసిన ప్రకటన ఎంత హాస్యాస్పదంగా ఉందో గమనిద్దాం. ‘దక్షిణాసియాలో శాంతి స్థాపనలో పాకిస్థాన్ భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం” అని వైట్‌హౌజ్ ప్రతినిధి తెలిపారు.

దక్షిణాసియాలో శాంతికి పాకిస్థాన్ దోహద పడుతోందా? ఇది హాస్యాస్పదం కాదా? సరే, ఇరాన్ గురించి మునీర్ చెప్పిన విషయాలకు ట్రంప్ ఫిదా అయినట్లు కనిపించారు. ‘భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, ఐ లవ్ పాకిస్థాన్, మోదీ ఈజ్ ఏ ఫాంటాస్టిక్ మ్యాన్’ అనీ మరోసారి ప్రకటించుకున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని నివారించినా తన గురించి ఒక్కటంటే ఒక్క వార్తా కథనం కూడా ఎవరూ రాయలేదని ట్రంప్ బాధ పడ్డారు.

ఏమైతేనేం, మోదీ విషయాన్ని స్పష్టం చేసినందుకో, అసత్యాన్ని ఎక్కువ రోజులు ప్రచారంలో పెట్టినా, తన నోబెల్ ప్రయత్నాలకు పెద్దగా ప్రయోజనం ఉండదనో చివరికి ట్రంప్ తూచ్ అన్నారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆ రెండు దేశాలే కుదుర్చుకున్నాయని, అందులో తన ప్రమేయం లేదని ఒప్పుకున్నారు. శాంతిదూతగా ఈ ప్రయాస విఫలమైంది.

నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెడతానని ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తొలినాళ్లలోనే ప్రకటించారు. యుద్ధం ఆపడం అటుంచితే, ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కూడా జరగలేదు. ఈ దిశగా అటు జెలినిస్క్‌తో, ఇటు పుతిన్‌తో ఎన్నిసార్లు ట్రంప్ మాట్లాడినా ప్రయోజనం కనిపించలేదు. నోబెల్ కోసం ఈ ప్రయత్నమూ ఫలించలేదు.

ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమిటనేది ఆసక్తిగా మారింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని అంటూనే, ఇరాన్‌ను అంతం చేయాలనే విధంగా అమెరికా ధోరణి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులను పశ్చిమ దేశాలు సమర్థిస్తుండగా, ఒక అడుగు ముందుకేసి, ఖమేనీ ఏ బంకర్‌లో దాక్కున్నాడో తనకు తెలుసునని, బయటికి రప్పిస్తానని ట్రంప్ ప్రకటించారు.

ఇప్పటికి ఇంకా యుద్ధ క్షేత్రంలోకి దిగని అమెరికా దేశాధ్యక్షునిగా, మరో దేశ సుప్రీం లీడర్ గురించి ఇలా ప్రకటన చేయవచ్చా? ఇంతకీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు?