calender_icon.png 16 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధక్షేత్రంలో సామాన్యులే సమిధలు

19-06-2025 12:00:00 AM

ఒకప్పుడు యుద్ధం అంటే రెండు రాజ్యాల సైనికులు మాత్రమే ప్రత్యక్షంగా బాహాబాహీ తలపడే దృశ్యాలే ఉండేవి. చాలావరకు రక్తపాతం సైనికులది అయితే రాజ్యాధికారం రాజులు అనుభవించేది. పరిస్థితి విషమిస్తే సైన్యాధ్యక్షులతో పాటు రాజులూ యుద్ధక్షేత్రంలోకి దూకి విజయమో వీరస్వర్గమో తేల్చుకొనేవారు. ఆనాడు సామాన్య ప్రజానీకానికి పెద్దగా ప్రాణనష్టాలు సంభవించేవి కావు.

కానీ, ఆధునిక ప్రజాస్వామిక యుగంలో యుద్ధరీతులు మారిపోయాయి. ఇప్పుడైతే డ్రో న్లు, క్షిపణులు, సైబర్ దాడుల వరకు పరిస్థితులు వచ్చేశాయి. ఫలితంగా నిరంకుశ దేశాధినేతలు, యుద్ధ పిపాసులు తాము సురక్షితంగా ఉంటూ, ప్రమాదకర వేళ పిరికివాళ్లలా బంకర్లలో దాక్కుంటుంటే, శత్రు దేశాల సైనికదళాలు ప్రయోగించే బాంబుదాడుల బారిన సామాన్యులు పడుతున్నారు.

జనావాసాలపైకి ఆయుధ దాడులు చేయరాదన్న యుద్ధ నిబంధన ఉన్నా ప్రేరేపితులు, మూలకారకులు, సాయుధులు సైతం ప్రజలతో కలిసి జీవిస్తూ ‘ప్రాణరక్షణ’ పొందుతున్నారు. 

ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం ఇవా ళ కోటిమంది జనాభాతో క్షిపణి దాడులను ఎదుర్కొంటున్న స్థితి దయనీయం. ఉన్నఫలాన లక్షలాదిమందిని ఊరు వదిలి పొమ్మంటే, ఎక్కడికి ఎలా వెళతారు? కారణం ఏదైనా పౌరుల నివాస ప్రదేశాలే క్షిపణులకు టార్గెట్ అవుతుండడం బాధాకరం. లక్షిత శత్రువుల కోసమే జరిగిన దాడులలో ఎక్కువగా సంఘర్షణలతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేని సామాన్య జనం బలై పోతుండటం దురదృష్టకరం.

బుద్ధుని బోధనలు ఏమాయె!

సుమారు రెండు వేలకుపైగా సంవత్సరాల కిందట రక్తాన్ని ఏరులుగా పారించిన కళింగ యుద్ధం కానీ, అంత క్రితం అయి దు వేల ఏళ్ల నాటిదిగా భావించే మహాభారత సంగ్రామం కానీ మానవజాతికి నేర్పిం చింది ఇదేనా? గాంధీ, బుద్ధుడు చూపి వెళ్లిన అహింసా మార్గం తెలివైన మానవజాతి హృదయాలను ఎందుకు కదిలించ డం లేదు? 20వ శతాబ్దం రుచి చూపిన రెండు ప్రపంచ యుద్ధాల మారణకాండ, అణ్వస్త్ర ప్రయోగాల మహావినాశనం తర్వా త కూడా ఆయా దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, యుద్ధపిపాసులు ఇంత నిరంకు శంగా ఎలా వ్యవహరిస్తారు? 

తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర యుద్ధ వా తావరణం అమెరికా జోక్యంతో ఎటు దారిస్తుందో ఎవరికీ బోధ పడటం లేదు. మూ డవ ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నామా? అన్న భయాందోళనలూ లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత కొన్నాళ్లుగా, కొన్నేళ్లుగా, దీర్ఘకాలంగానూ కొనసాగుతున్న సాయుధ (అంతర్జాతీయ) పోరాటా లు, ప్రాంతీయ యుద్ధాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

ఇవాళ్టి యుద్ధ విధానాలు కత్తులు, బాణాలు, ఈటెలు, గండ్ర గొడ్డళ్లను, ఇం కా ఫిరంగులు వంటివాటిని దాటి డ్రోన్లు, క్షిపణులు, సైబర్ దాడులకు చేరుకున్నా యి. యుద్ధవిమానాలు, ఫైటింగ్ రాకెట్లు విధ్వంసాలను మోసుకుపోయి చివరకు ప్రజాసమూహాలపై పడేస్తుంటే, పెద్దమొత్తంలో జనం హతమవకుండా ఎలా ఉం టారు? ఇలాంటి మూకుమ్మడి బలిదానం ఎంతవరకు న్యాయసమ్మతం?

ప్రజాస్వామ్య యుగం ప్రారంభంలో పుట్టిన సాయుధ పోరాటాల నుంచి నేటి ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ వరకూ ప్రతీ యుద్ధక్షేత్రంలోనూ సమిధలవుతున్న అమాయక పౌరుల సంఖ్య ఆందోళనకరం గా ఉంటున్నది. తప్పొప్పులు ఎవరివైనా ఆస్తిపాస్తులతోపాటు ప్రాణాలు సైతం కోల్పోవలసి వస్తున్నది. నిజమే, కొన్ని సందర్భాల్లో ముల్లునుముల్లు తోటే తీయాలి. కానీ, సమస్య కొందరు వ్యక్తులదా?

మొత్తం దేశానిదా? వ్యక్తిగత సమ స్యలను సమూహాలకు, వర్గ సంక్షోభాలను జాతులకు ఎలా ఆపాదిస్తారు? అసలైన వాళ్ళు నేరుగా యుద్ధరంగంలోకి రాకుం డా భద్రంగా ఉండటమో, బంకుల్లోకి వెళ్లడమో ఎలా కరెక్టు అవుతుంది? మనుషుల లో ప్రతీకార జ్వాల అన్నది చెలరేగితే అది ఎంతటికైనా తెగించేలా చేస్తుంది.

ప్రపం చం సర్వనాశనమైనా వారి మది శాంతిస్తుందన్న హామీ లేదు. ఎంతో రక్తపాతం చూశాక అశోకునిలో మార్పు వస్తే, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లను తాను తిరిగి బతికించగలిగాడా? ఇరాన్ అణ్వస్త్ర భయం కానీ, మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు కానీ వినపడ వలసిన వాళ్లకు వినపడాలి, వాళ్లు వినిపించుకోవాలి. 

ప్రతీకార జ్వాల చల్లారేదెలా?

ప్రస్తుత ఇజ్రాయెల్- ఇరాన్ సైనిక వివాదం హైబ్రిడ్ యుద్ధయుగంలో జరుగుతోంది. ఇక్కడ సైబర్ దాడులు క్షిపణు లు, సైనికదళాలను సైతం అధిగమించ వచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా ఇరా న్ సైబర్ కార్యకలాపాలతో ప్రతీకారం తీ ర్చుకోవచ్చనీ విస్తృతంగా వినిపిస్తున్నది. ఇవి అమెరికన్ లక్ష్యాలకు విస్తరించ వచ్చని కూడా సైబర్ యుద్ధ నిపుణులు, ముప్పు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ జూన్ 13న ఇరాన్ అణుకేంద్రాలు, సైనిక కమాండర్లపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి చాలాకా లం ముందే సైబర్ గూఢచర్యం ప్రారంభమైనప్పటికీ, ఇరాన్ సైనిక సామర్థ్యాలకు తీవ్ర దెబ్బ తగిలినందున ఇప్పుడా దేశం మరింత విధ్వంసక సైబర్ దాడులను ప్రారంభించవచ్చనే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన యుద్ధాలకుతోడు పదుల సంఖ్యలో సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అనేక హింసాత్మక దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వీటికి దీర్ఘకాల చారిత్రక, రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు ఆ జ్యం పోశాయి. ఈ 2025 నాటి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘర్షణలు, వాటి పర్యవసానాల గణాంకాలు, వాస్తవాలు అత్యంత భయానకంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

చాలామందికి ప్ర పంచం ఇటీవల మరింత అసురక్షిత ప్రదేశంగా మారిందని అనిపిస్తుంది. 2022 ఫిబ్రవరిలో రష్యన్ దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసి పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పట్నించీ ఇది ప్రపంచ వ్యవహారాలపై తీవ్ర ప్రభావమే చూపిస్తున్నది. 2023 అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిని ప్రారం భించింది. ఇందులో 1,200 మందికి పైగా పౌరులు మరణించారు.

ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ఆక్రమించింది. ఈ సంఘర్షణలో తీవ్ర మానవీయ బాధను కలిగించిన అంశమేమిటంటే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 48,000 మందికి పైగా ప్రజలు మరణించినట్లు నివేదికలు వెల్లడించడం! ప్రస్తుత ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఫలితంగానూ వందలాదిమంది పౌరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

100కు మించి సాయుధ పోరాటాలు

స్విట్జర్లాండ్‌లోని ‘జెనీవా అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యుమెనిటేరియన్ లా అం డ్ హ్యుమన్ రైట్స్’ విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక అధ్యయనం (రూల్ ఆఫ్ లా ఇన్ ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ ఆన్ పోర్టల్’ ఆర్‌యుఎల్‌ఏసీ) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 100కు మించి సాయుధ పోరాటాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ మానవతా చట్టం మేరకు సాయుధ సంఘర్షణకు సమానమైన అన్ని సాయుధ హింస పరిస్థితుల నేపథ్యం ఆధారంగానే ఈ వర్గీకరణ జరిగినట్టు నిపుణులు చెప్పారు.

వాటిలో కొన్ని ప్రపంచస్థాయిలో అతిముఖ్య ఆందోళనలుగా మారాయి. అందులో కొన్ని ఇటీ వలే ప్రారంభం కాగా, మరికొన్ని 50 ఏళ్ల కు పైగా కొనసాగినట్లు, ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. మూడో ప్రపంచ యుద్ధం అన్నది జరగడం లేదన్న మాటే కాని ఆయా ఖండాలలో అనేక దేశాలు, ప్రాంతాలు, వర్గాల నడుమ తీవ్ర సంఘర్షణలే చోటు చేసుకుంటున్నాయి.

వీటిలో అత్యధికంగా ప్రాణనష్టం జరుగుతున్నది మాత్రం అభంశుభం తెలియని సామాన్యులకే. 45 కంటే ఎక్కువ సాయుధ సంఘర్ష ణలతో మధ్యతూర్పు, ఉత్తరాఫ్రికా, 35 కంటే ఎక్కువ పోరాటాలతో ఆఫ్రికా, 21 ఘర్షణలతో ఆసియా, 7 పోరాటాలతో ఐరోపా, 6 సంఘర్షణలతో లాటిన్ అమెరికా ప్రాంతాలు సాయుధ పోరాటాలలో మునిగి ఉన్నట్టు నిపుణులు చెప్పారు.