15-07-2025 08:52:06 PM
వాజేడు,(విజయక్రాంతి): వాజేడు మండలలో మొరుమూరు పంచాయతీ పరిధిలో ఘనపురం కాలనీ గ్రామంలో మంగళవారం ఉదయం 2.30 గంటలకు వెంకటాపురం నుండి జగన్నాధపురం వైపు అక్రమంగా తరలిస్తున్న టేకు కలప వ్యాన్ ను పట్టుకొని వాహనమును సీజ్ చేసినట్లు దూలాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణ వెల్లడించారు. ఎఫ్ ఆర్ వో తెలిపిన వివరాల మేరకు ఆ కలప ఛత్తీస్గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా నుండి తెలంగాణలోకి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గణపురం కాలనీలో కాపలా కాసి వాహనమును అడ్డుకోగా సదరు వాహన డ్రైవర్ ఫారెస్ట్ అధికారులను చూసి పారిపోయాడని పేర్కొన్నారు. అనంతరం పట్టుకున్న టాటా జినాన్ పికప్ వాహనంను వెంకటాపురం డివిజన్ ఆఫీసుకు తీసుకొని వచ్చి సీజ్ చేశామన్నారు. వాహనంలో కలప విలువ సుమారు 3లక్షల పదివేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి ఓ లు వాసు బాబు, సిహెచ్ లలిత కుమారి, పవన్, హర్ష, బేస్ క్యాంపు వెంకటాపురం సభ్యులు పాల్గొన్నారు.