11-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 10 : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బీఎన్రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్ల ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రంక్ లైన్స్ సమస్యలు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని జలమండలి అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.
మెట్రో వాటర్ వరక్స్ ఎండీ అశోక్ రెడ్డిని బుధవారం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సాగర్ కాంప్లెక్స్ మీదుగా వచ్చే డ్రైన్స్ నీరు గుర్రంగుడా ఫారెస్ట్, హరిహారపురం కాలనీలోకి వస్తున్నట్లు తెలిపారు.
దీంతో ఫారెస్ట్ లో ఉన్న రెండు చెరువులు మురుగుకూపంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సాగర్ కాంప్లెక్స్ కల్వర్టు నుంచి, అలాగే హరిహారపురం కాలనీ దగ్గర ఉన్న డ్రైనేజీ ఛాంబర్ వద్ద కలపడానికి షార్ట్ టెండర్ ఏర్పాటు చేసి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పందించి దాదాపు రూ, 17 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని స్వాతి రెసిడెన్సీ వద్ద దాదాపు మూడు నెలల క్రితం ఆగిపోయిన ట్రంక్ లైన్స్ పనులు వెంటనే ప్రారంభం చేయాలని కోరారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీ, దుర్గ నగర్, వెంకటేశ్వరకాలనీ, పీ అండ్ టీ కాలనీ, రాజేశ్వరి కాలనీ, మైత్రి విల్లాస్ తదితర కాలనీలకు ట్రంక్ లైన్ వ్యవస్థ ఎర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, ముత్యంరావు, నరేన్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.