calender_icon.png 9 May, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు

09-05-2025 02:14:04 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ, మే 8(విజయక్రాంతి) : రాబోయే నాలుగేండ్లలో తెలంగాణవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదవారికి కట్టించి ఇస్తామి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం అయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు.

పేదవాడు బలోపేతం అయ్యేందుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఇల్లు లేని, కనీసం గోడ కూడా కట్టుకోలేని వారికి మొదటి విడతలో ఇండ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో విడతలవారీగా అర్హులైన పేదవారందరికీ ఇండ్లు  ఇస్తామని,  మొదటి విడతలో ప్రతి  నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇచ్చామని, ఇంకా 3 విడతలుగా ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారందరికీ 20 లక్షల ఇండ్లను రూ.5 లక్షల వ్యయంతో కట్టించి ఇస్తామన్నారు. భూ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ కానుందన్నారు. జూన్ 2 నుండి ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులు వచ్చి న్యాయమైన భూ సమస్యలను పరిష్కరించనున్నారని తెలిపారు.

భూ భారతిలో పెండింగ్లో ఉన్న 9.26 లక్షల సాదా బైనమాల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ శాశ్వతంగా పరిష్కారమయ్యేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి హక్కులు కల్పించనున్నామన్నారు. భూభారతి చట్టాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దామని, ధరణి కేవలం కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడిందని, భూ భారతిలో సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

భూ భారతిలో నకిరేకల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పేదవాడి కోరికలన్ని తుంగలో తొక్కి , వారి స్వార్థం కోసం తాపత్రయ పడడం తప్ప ఎలాంటి ఉపయోగపడే పని చేయలేదని, 45 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, తాము అధికారంలోకి వచ్చాక 650 కోట్లు ఖర్చు చేసి తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి తాగు నీటిని అందిస్తున్నామని వివరించారు.

లక్ష పదివేల కోట్లు ఖర్చు చేసి కాలేశ్వరం నిర్మిస్తే కూలిపోయిందన్నారు. గడచిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో వైద్యంపై రూ.11800 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5650 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.  విద్యలో భాగంగా హాస్టల్స్, పాఠశాలలు కట్టించడమే కాకుండా, 58 నియోజకవర్గాల్లో రూ.11600 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఒక్కొక్కటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నామన్నారు.

పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని 80 శాతం డైట్ చార్జిలను పెంచామని, 200 శాతం కాస్టోటిక్ చార్జీలు పెంచామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500 ఎల్పీజీ కనెక్షన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు, ఒక్కొక్కరికి ఆరు కేజీలు చొప్పున సన్న బియ్యం వంటి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరిక మేరకు నకిరేకల్ మండలానికి నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేశారు. అదేవిధంగా మండలంలో పెండింగ్లో ఉన్న  భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.