20-07-2024 11:31:38 AM
కూలీ పని చేయించుకొని మద్యం తాగించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యం
నిర్మానుష ప్రదేశంలో వదిలి వెల్లె ప్రయత్నం
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
అచ్చంపేట మండలం హాజీపూర్ లో దారుణం
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: పొట్టకూటికోసం దినసరి కూలీగా పనిచేసుకునే ఇద్దరు దళిత మహిళలను రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మార్వాడీలు మద్యం తాగించి కారులో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ శివారులో వెలుగు చూసింది. అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని బల్మూర్ మండల ప్రాంతానికి చెందిన (35) ఏళ్ల ఇద్దరు దళిత మహిళలు పొట్టకూటి కోసం నిత్యం అచ్చంపేట ప్రాంతంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.
గురువారం అడ్డా మీద ఉన్న ఆ కూలీలను తమ ఇంట్లో పని ఉందని అచ్చంపేట పట్టణంలోని టైల్స్ దుకాణ యజమాని వినోద్ సింగ్ (38), హైదరాబాదులో నివాసం ఉండే తన సన్నిహితుడు గజానంద్ (35)లు వారితో కూలీ మాట్లాడుకున్నారు. ఇంట్లో పని ముగిశాక మద్యం తాగించి కారులో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా డిండి వెళ్లి మరోసారి మద్యం తాగించారు. అనంతరం సాయంత్రం అచ్చంపేట మండలం హాజీపూర్ శివారులో కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను గుర్తించి కోర్టు ముందు హాజరుపరిచారు.