calender_icon.png 21 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి

21-08-2025 06:01:13 PM

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

బాన్సువాడ (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు, ఎక్సెల్ ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల కథనం ప్రకారం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ శివారులో గురువారం ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొనడంతో బాన్సువాడ మండలం సోమ్లనాయక్ తండాకు చెందిన రమావత్ గోవింద్ మృతి చెందారు. రమావత్ రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో రాముడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ సైతం తీవ్ర గాయాలయ్యాయి. బోర్లం క్యాంపు శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వేరే మార్గం ద్వారా ద్విచక్ర వాహనదారులు వెళ్లే ప్రయత్నంలో కామారెడ్డికి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు గోవింద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. విచారణ చేపట్టి న్యాయం చేపడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో  గ్రామస్తులు ధర్నా విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.