05-01-2026 02:05:55 AM
వెలుగులన్నీ వెంటేసుకుని సూరీడు వెళ్లిపోయాక
నిశ్శబ్దం నల్లటి దుప్పటిలా ప్రాణాన్ని కప్పేస్తున్నవేళ
శూన్యంలా తోచిన మబ్బుల వెనుక ఆకాశం
దిక్కుతోచని జీవితంలా చిక్కుముడిగా మారింది.
చీకటి సిగలో చిక్కుకుని ప్రకాశించే చుక్కలు
ఆ కురులలో కూర్చిన సహజ కాంతులు కావవి..
ఖర్చుపోయిన క్షణాలు మిగిల్చిన చిల్లర నాణేలు.
లెక్కతేలని బతుకును వెక్కిరిస్తున్న జ్ఞాపకాలు
గతం..
తారల్లా ఆగిపోయి.. సుదూర దృశ్యమైతే..
తెరలా తేలియాడే మేఘాలే
రేపటి స్వప్నాలు..
కాలం ఎటు నెడితే అటు కదులుతూ కుదురులేక,
ఇంకా చిరునామా దొరకని సంచార జీవులు
నిశ్చలమైన గతం -చంచెలమైన భవితకు మధ్య
ఏతీరం చేరాలో తెలియని అంతులేని సందిగ్ధంలో
నా అన్వేషణే నిలువెత్తు రూపం దాల్చినట్టుగా
ఏకాకిలా కదలనట్టు కదుల్తున్నాడు చంద్రుడు
ఆకాశమనే అనంత నల్లని నీడల నిండు వాకిట్లో
నక్షత్రాలనే చుక్కలను ఒడుపుగా కలుపుతూ
మబ్బులనే పల్చని తెల్లని మేలిమి ముగ్గుపొడితో
రేపటి ఆశను నాజూకుగా దీక్షగా దిద్దుతున్నాడు
రేయికి చంద్రప్రభను అద్దుతూ..
ఆ గీతల చక్కని చిక్కదనానికి
నింగి గుండెకు బెంగతో బరువైందేమో!
రంగవల్లికకి వాడిన మబ్బుల చూర్ణమే
రాత్రంతా మథనపడి నలిగి కరిగి వడలి
చెట్ల కొమ్మల జల్లెడలోంచి వెన్నెల కాంతులతో కలిసి,
రాలిపడే ఆకుల్లా జారిపడి -
తెల్లారి పొగమంచుగా
నేలను ముద్దాడుతోంది.
వర్తమానం మీద
వ్యామోహంతో..
ఆర్ద్ర సమాగమమై!