calender_icon.png 23 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు నెలల పసికందును అపహరించిన దుండగులు

23-05-2025 01:33:17 AM

సిద్దిపేట, మే 22 (విజయక్రాంతి): తల్లి ఒడిలో ఉన్న రెండు నెలల పసికందును మాస్కులు వేసుకొని వచ్చిన ఇద్దరు దుండగులు అపహరించిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ వి.గంగరాజు తెలిపిన వివరాలు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్ తన భార్య కవిత, రెండు నెలల కుమారుడితో అప్పనపల్లి గ్రామంలో గ్యార ఎల్లవ్వ అనే బంధువు ఇంట్లో నివాసముంటు, డెకొరేషన్ వర్క్ చేస్తున్నాడు.

ఈనెల 17వ తేదీన పని కోసం శ్రీమాన్ రుద్రారం లో ఉన్న తన అక్క వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి బయట రెండు నెలల కుమారుడిని ఎత్తుకొని ఉన్న కవిత వద్దకు ఇద్దరు మాస్క్ వేసుకొని వచ్చిన దుండగులు ఆమెతో మాటలు కలిపి, ఆమె ఒడిలో ఉన్న రెండు నెలల పసికందును బలవంతంగా ఎత్తుకొని, ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీంతో కవిత ఎంత అరచినా, అక్కడికి ఎవరూ రాలేదు. సమాచారం అందుకున్న బాలుడి తండ్రి శ్రీమాన్ బుధవారం రాత్రి భార్యతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.