20-08-2025 02:01:53 AM
- ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం దిశగా అడుగులు
- దర్యాప్తు సంస్థలకు మరింత పవర్
- సోదాలు, ఆస్తుల జప్తుకు అధికారాలు
- న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినేట్ నిర్ణయాలు
- ఇవాళో రేపో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఆన్‌లైన్ గేమింగ్, సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సినీ, క్రీడరంగాలకు చెందిన ప్రముఖులు బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో గేమింగ్ విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధించేందుకు, మోసాలకు పాల్పడిన వారితో పాటు బెట్టింగ్ ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. నేరాలు పునరావృతమైతే శిక్షలు, జరిమానా రెట్టింపు చేసేందుకు యంత్రానికి అధికారాలు వస్తాయి. ఈ -స్పోర్ట్స్, ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక అథారిటీని సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది.
అలాగే ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో నగదు లావాదేవీలపై దర్యాప్తు చేసేందుకు, సంస్థల కార్యాలయాల్లో సోదా లు, ఆస్తుల జప్తు, స్వాధీనానికి బిల్లు అధికారాలు ఇస్తుంది. యాప్‌లపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అయినప్పటికీ వ్యవస్థల కళ్లు గప్పి నిర్వాహకులు గేమింగ్, బెట్టింగ్ దందా చేస్తున్నారు. తాజా బిల్లుతో బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే క్యాబినెట్ రాజస్థాన్‌లోని కోటా బుందిలో రూ. 1,507 కోట్లతో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.8,307.74 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బైపాస్ నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.