వరుస బస్సు ప్రమాదాలు నన్ను కలవరపరుస్తున్నాయి: బండి సంజయ్
వరుస బస్సు ప్రమాదాలు నన్ను కలవరపరుస్తున్నాయి: బండి సంజయ్
04-11-2025 09:11:43 AM
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట బ్రిడ్జిపై వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వడ్లలోడు ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి ప్రయాణికులకు గాయాలు కాగా, తక్షణమే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ వరుస బస్సు ప్రమాదాలు తనను కలవర పరుస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద జరిగిన బస్సు-ట్రాక్టర్ ప్రమాదం బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్న బండి సంజయ్ అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మెట్పల్లి డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న గాయపడిన 15 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేంద్రమంత్రి తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు.