07-09-2025 01:26:38 AM
-మానుకోటలో ఎస్పీ ఆధ్వర్యంలో పంపిణీ
-తోపులాటలో సొమ్మసిల్లిన ఇద్దరు రైతులు
మహబూబాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి)/నకిరేకల్: మహబూబాబాద్ జిల్లా లో యూరియా కోసం రైతుల పోరు మరిం త ఉధృతమైంది. జిల్లా కేంద్రంలోని కంకర్ బోర్డ్ సొసైటీ వద్ద శనివారం వందల మంది రైతులు బారులు తీరారు. యూరియా లారీలు రాగానే రైతులు ఒక్కసారిగా లారీల వద్దకు దూసుకెళ్లారు. యూరియా బస్తాల కోసం కొందరు లారీ పైకెక్కి మూడు బస్తాల యూరియాను తీసుకెళ్లారు.
ఈ ఘటన చూసిన మరికొందరు క్యూ లైన్ నుంచి ఒక్కసారిగా లారీల వద్దకు పరిగెత్తగా, పరిస్థితి చేయి దాటి పోతుందనే విషయాన్ని పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచా రం ఇచ్చారు. అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్వయంగా జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ హుటాహుటిన అక్కడికి వచ్చారు. పోలీసులను అప్రమత్తం చేసి రైతులందరినీ తిరిగి క్యూలో రావాలని మైక్ ద్వారా పిలిచారు. వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసు, ఇతర జిల్లా అధికారులను అక్కడికి రప్పించారు.
పోలీసుల చేత మహిళలు పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయించారు. వృద్ధులకు ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి స్వయంగా ఎస్పీ మూడు గంటల పాటు అక్కడే ఉండి యూరియా బస్తాలు పంపిణీ చేయించారు. అయితే ఇక్కడ జరిగిన తోపులాటలో మహబూబాబాద్ మండలం దుద్యా తండాకు చెందిన భూక్యా వసంత సొమ్మసిల్లి పడిపోయింది. మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లి సపర్యలు చేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. ఇక ఇదే జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతులు తెల్లవారుజామునుండే యూరియా కోసం బారులు తీరారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా ఆగ్రోస్ నిర్వాహకుడి వద్దకు రైతులు గుమిగూడటంతో తోపులాట జరగడంతో రైతు భూక్య రమేష్ గాయపడ్డాడు.
దీంతో ఆగ్రోస్ నిర్వాహకుడు విసుగు చెంది తన చేతిలో ఉన్న టోకెన్లు, రైతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ ప్రతులను విసిరి వేశాడు. అనంతరం పెద్ద ఎత్తున రైతులు ఎరువుల గోదాములోకి దూసుకు వచ్చి యూరియా బస్తాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఎస్‌ఐ రమేష్ బాబు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి తలుపులు ముగించి యూరియా పంపిణీ నిలిపివేశారు. ఆదివారం నుండి రైతు భరోసా పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేస్తామని ప్రకటించారు. క్లస్టర్ల వారిగా ఆయా గ్రామాల పరిధిలోని రైతులకు పిఓఎస్ యంత్రాల ద్వారా యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.
దీనికి రైతులు అంగీకరించి వెళ్లిపో యారు. అయితే ఆ తర్వాత సాయంత్రం ఉదయం నుంచి నిరీక్షించిన రైతుల్లో కొందరు రేపటికి మళ్లీ ఎలా ఉంటుందో ఏమో ఈ రోజే యూరియా పంపిణీ చేయాలంటూ నెల్లికుదురు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు కట్టం గూర్ మండల కేంద్రంలో రైతు వేదిక, పిఎసిఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుండి రైతులు బారులు తీరారు.