29-09-2025 12:12:28 AM
రావణ వధ ఏర్పాట్లు ఎవరికి వారే!
మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిస్థితి. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తన సొంత మండలం అయిన కేసముద్రాన్ని 2024లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదన అంశాన్ని తిరిగి పునర్జీవం పోసి 2024లో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్ ఉమ్మడి గ్రామాలతో పాటు అమీనాపురం, దనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామపంచాయతీలను కలిపి కేసముద్రం నూతన మున్సిపాలిటీగా ఆవిర్భవి ంచింది. అయితే ఇప్పటివరకు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ, ఈ దసరా పండగ కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో ఎవరికి వారు నిర్వహిస్తుండడంతో కేసముద్రం మున్సిపాలిటీగా ఒకటైనప్పటికీ దసరా పండుగ సందర్భంగా ముక్కలుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
సద్దుల బతుకమ్మను ప్రభుత్వం అధికారుల ద్వారా అధికారికంగా నిర్వహిస్తుండగా, దసరా సందర్భంగా రావణ వధ కార్యక్రమాన్ని ఎవరికివారు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వ కేసముద్రం విలేజ్ పరిధిలోని జ్యోతిబాపూలే సెంటర్ వద్ద కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన నేతలు, మాజీ సర్పంచులతో పాటు సుమారు 100 మంది కలిసి సొంత ఖర్చులతో రావణ వధకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో కేసముద్రం విలేజ్ కు చెందిన కాంగ్రెస్ నేత వేముల శ్రీనివాస్ రెడ్డి సొంత ఖర్చులతో పోలీస్ స్టేషన్ సమీపంలో రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరోవైపు కేసముద్రం స్టేషన్ కు చెందిన వివిధ పార్టీల నేతలు, మాజీ సర్పంచులు కలిసి ఫ్లు ఓవర్ సమీపంలో రావణ వధ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మున్సిపాలిటీగా ఏర్పడక ముందు ఎక్కడికక్కడే రావణ వధ కార్యక్రమాన్ని .
అప్పుడప్పుడు నిర్వహిస్తుండగా, మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత అంతా కలిసి ఒకే చోట భారీగా రావణ వద ఏర్పాటు చేస్తే బాగుండేదని, ప్రజలంతా ఒకే చోట చేరే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఎవరికి వారు పట్టణ పరిధిలో మూడు చోట్ల రావణ వద ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పటికీ మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామాలకు చెందిన పార్టీల నేతల మధ్య ఐక్యత లేదని విమర్శలు వస్తున్నాయి.
చందాల వసూళ్లపై విమర్శలు
ఇదిలా ఉండగా రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొందరు నేతలు కేసముద్రం స్టేషన్ పరిధిలో చందాల వసూళ్లకు పాల్పడడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రావణ వధ కార్యక్రమాన్ని దాతల సహకారం లేదంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి నుంచి విరాళం స్వీకరించి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా షాపుల యజమానులు,
మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ఇతర సంస్థల నుండి బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కనీసం తాము ఇష్టపూర్వకంగా ఇచ్చినంత తీసుకోవడం లేదని, వారు అడిగినంత ఇవ్వాల్సిందేనని దబాయిస్తున్నారని కొందరు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.