calender_icon.png 23 December, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచానికి దిశానిర్దేశం చేసేది విశ్వవిద్యాలయాలే:ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి

23-12-2025 12:10:54 AM

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్

కాకతీయ యూనివర్సిటీ, డిసెంబర్ 22 (విజయక్రాంతి): దేశంలో, ప్రపంచంలో వస్తున్న అనేక సామాజిక, సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుని ప్రపంచానికి దిశ నిర్దేశనం చేసే వేదికలు విశ్వ విద్యాలయాలే అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలక్రిష్ణ రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ వేదికగా (ఎబివిపి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం మొదటి రోజు ఎబివిపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జానారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా మహానీయుల చిత్ర పటాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం పూర్తి వందేమాతరం ఆలపించిన తర్వాత ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బాలక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం ప్రత్యేకమైన దేశమని, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం అని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యా వ్యవస్థ ఉండాలని ప్రస్తుతం 80 లక్షల మంది విద్యార్థులు 1లక్ష మంది అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. విద్యారంగం పై ప్రధానంగా ఐదు అంశాలు ప్రభావం చూపుతున్నాయని అవి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్,డిజిటలైజేషన్, లాంటివని పేర్కొన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం అమలు కావడం వల్ల భారత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ప్రపంచం లోనే అత్యధికంగా 1004 శాటిలైట్లు ప్రయోగించిన దేశం భారత్ అని గుర్తు చేశారు.రాబోయే కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ, పబ్లిక్ రంగాల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని దాని ద్వారా సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు భారత దేశంలో ఏర్పడనున్నాయని తెలిపారు. యువత నిరుత్సాహానికి లోను కాకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేయూ వైస్ ఛాన్సలర్ కె . ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని విద్యా వ్యవస్థ లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను గమనిస్తూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలన్నారు.

యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతో పాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూ ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరిగే శివకుమార్, ఎబివిపి తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డాక్టర్ మాసాడి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, స్టేట్ యూనివర్సిటీస్ హాస్టల్స్ కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతూ సింగ్, కేయూ ఎబివిపి ఇంచార్జీ డాక్టర్ నిమ్మల రాజేష్, అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు, ఎబివిపి కార్యకర్తలు పాల్గొన్నారు.