23-12-2025 01:45:12 AM
కళతప్పిన కార్మిక కాలనీలు!
* దశాబ్దాలుగా సింగరేణికి సిరులు పండించిన బెల్లంపల్లి.. ఓపెన్ కాస్ట్‌కు బలైపోయింది! 130 ఏళ్ల సింగరేణి ప్రస్థానంలో- నల్లబంగారం నేలగా ప్రసిద్ధిచెందిన బెల్లంపల్లి నేడు పారిశ్రామికంగా సర్వం కుదేలైంది. 1991నాటి సంస్కరణలు బెల్లంపల్లి చరిత్రకు మరణ శాస నం రాశాయి. సింగరేణి ఆవిర్భావం వేడుకలకు కూడా నోచుకోని దైన్యస్థితిలోకి బెల్లంపల్లిని నెట్టి వేశారంటే అతిశ యోక్తి కాదు.
సింగరేణిలో మహోజ్వలమైన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు గనులకి జీవగడ్డగా అపరఖ్యాతి కలిగిన బెల్లంపల్లిని బహుముఖ వ్యూహంతో తెగ నరికి శ్మశానంగా మార్చారని, ప్రజలు, కార్మికుల నోట్లో మట్టికొట్టారని స్థానిక కార్మికులు, ప్రజలు వాపోతున్నారు. సింగరేణి 130 ఏళ్లు ఆవిర్భావ వేడుకల్ని పురష్కరించుకొని బెల్లంపల్లి దీనస్థితిపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం’.
130 ఏళ్ల సింగరేణి ప్రస్థానంలో నల్లబంగారం నేల కుదేలు
1991 సంస్కరణలు బెల్లంపల్లి చరిత్రకు మరణశాశనం
నూతన పారిశ్రామిక విధానాలు.. ప్రజలు, కార్మికుల నోట్లో మట్టి?
అధికారుల తప్పిదాలే బెల్లంపల్లికి శాపం
బెల్లంపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : సింగరేణి సంస్థ ప్రస్థానానికి 130 ఏళ్లు. ఖమ్మం జిల్లా ఇల్లందులో బ్రిటిష్ కాలంలో 1870లో బ్రిటీషు శాస్త్రవేత్త విలియం కింగ్ బీ బొగ్గుట్ట ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో బొగ్గు తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నామకరణం జరిగింది. ఇక అప్పటి నుంచి అధికారికంగా సింగరేణి హయాంలో బొగ్గు ఉత్పత్తి మొదలైంది. సింగరేణి ఆవిర్భవించి నేటికి 130 ఏళ్లు. కొత్తగూడెం ఇల్లందు తరువాత బొగ్గు గనుల తవ్వకాలు బెల్లంపల్లిలోనే చేపట్టారు.
సింగరేణి ఆవిర్భావ చరిత్రలో బెల్లంపల్లిది అత్యంత కీలకమైన స్థానం. సింగరేణి బొగ్గు పరిశ్రమకు మరో బొగ్గుట్టగా బెల్లంపల్లికి గొప్పపేరుంది. బెల్లంపల్లి దశాబ్దాలుగా సింగరేణికీ సిరులు పండించింది. అలాంటి బెల్లంపల్లికీ సింగరేణి అధికారుల తప్పుడు విధానాలు పెనుశాపంగా మారాయి. సింగరేణి చిత్రపటంలో కొత్తగూడెం తరువాత అంతటి సమాంతర చరిత్రను సొంతం చేసుకున్న బెల్లంపల్లి, పారిశ్రామికంగా కనుమరుగైంది. బెల్లంపల్లిని ఓపెన్ కాస్టు చేయాలనే అధికారుల అత్యుత్సాహ ప్రణాళిక బెల్లంపల్లి కొంప ముంచింది.
పారిశ్రామికంగా ఒక వెలుగు వెలిగినా.. బెల్లంపల్లి నేడు కాలగర్భంలో కలిసిపోయింది. ఒకప్పుడూ వేలాది మందిని అక్కున చేర్చుకుని ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటిది నేడు బెల్లంపల్లి కరువు కాటకాలకు కేంద్రమైంది. స్థానికంగా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేని కడుదీన స్థితికి బెల్లంపల్లిని దిగజార్చారు. అందుకు కేవలం ఒకే ఒక కారణంతో బెల్లంపల్లిని అంతంపట్టించారు. అది అణుబాంబుకు సమానమైన ఓపెన్ క్యాస్టు అని వేరే చెప్పనక్కర్లేదు.
సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టు చేయకుండానే ముందస్తూ చర్యలతో బెల్లంపల్లిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పారిశ్రామికంగా అస్తిత్వం లేకుండా చేశారు. కనీసం బెల్లంపల్లి ఏరియా అనే పేరును కూడా మిగల్చలేదు. బెల్లంపల్లి పేరు అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా చేశారు. అందుకు బెల్లంపల్లి తాజా జీవన చిత్రమే సాక్షీభూతం.
డిపార్ట్‌మెంట్ల ఆవిర్భావం
తొలితరం గనుల ప్రస్థానంలో భాగంగానే బెల్లంపల్లిలో భూగర్భగనులకు అనుసంధానంగా వివిధ రకాల విభాగాలు వెలిశాయి. పవర్ హౌస్, వర్క్ షాప్, గ్యారేజీ, బొగ్గు అన్వేషణ విభాగం, టింబర్ యార్డ్, టబ్బుల తయారీ విభాగం, మౌల్డింగ్ సెక్షన్, ఎలక్ట్రికల్ విభాగం, మిషన్ షాప్ విభాగం, వీటీసీ వంటి ప్రధాన రంగాలు ఏర్పడ్డాయి.
మాదారం కేంద్రంగా గనులు
బెల్లంపల్లి పట్టణంతోపాటు మాదారం కేంద్రంగా భూగర్భగనులు తాండూరు కోల్‌మైన్ పేరుతో ఆవిర్భవించాయి. బోయపల్లి, ఎంవీకే -1, 2, 3, 5, 6 భూగర్భ గనులు వెలిశాయి. భూగర్భగనులతోనే అటవీ ప్రాంతమైన మాదారం పారిశ్రామిక పట్టణంగా రూపుదిద్దుకుంది. అక్కడ గనులు, డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించారు. దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి, మాదారం బొగ్గు గనులు విశిష్టమైన పాత్ర వహించాయి.
బొగ్గు ఉత్పత్తిలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాయి. సింగరేణి కంపెనీని లాభాల్లో నడిపించడంలో బెల్లంపల్లి, మాదారం గనులు సింహభాగంలో ఉండేవి. మొత్తంగా బెల్లంపల్లి రీజియన్‌కు బెల్లంపల్లి పట్టణం ప్రధాన గుండెకాయ అయింది. ఇక్కడే జీఎం ఆఫీసు, ఏజెంట్ ఆఫీసులు ఉండేవి. గనుల పర్యవేక్షణ బెల్లంపల్లి కేంద్రంగానే జనరల్ మేనేజర్, ఇతర అధికారులు చేస్తుండేవారు.
1991లో వచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సింగరేణి పరిస్థితినీ తారుమారుచేశాయి. అధికారుల ఆలోచన, బొగ్గు ఉత్పత్తి విధానాల్లో వినూత్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవే బెల్లంపల్లి పాలిట శాపంగా మారాయి. ప్రజలు, కార్మికుల నోట్లో నూతన పారిశ్రామిక విధానాలు మట్టి కొట్టాయన్న విమర్శలు ఉన్నాయి.
కౌంట్ డౌన్ స్టార్ట్
భూగర్భ గనులు తిరోగమనం దారిపట్టాయి. ప్రధానంగా బెల్లంపల్లి కేంద్రంగా ఓపెన్ కాస్ట్ తెరపైకి వచ్చింది. దీని ప్రాతిపదిక దిశగా అధికారులు పావులు కదపడం మొదలుపెట్టారు. బెల్లంపల్లిలో 2000 దశకం ముందే తొలుత పవర్ హౌస్‌ను మూసివేశారు. ఇదే క్రమంలో వేలాది మందికి నిలయంగా మారిన భూగర్భ గనుల్లో పనిచేస్తున్న కార్మికులను స్ప్రస్ ఫుల్ పేరిట ఖాళీ చేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరోవైపు మాదారం గనులను మూసివేశారు. మాదారం పట్టణాన్ని జీవచ్చవం లేకుండా చేశారు.
కైరిగూడ, అబ్బాపూర్ ఓపెన్ కాస్టుల ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని మాదారం 1, 2, 3, 5, 6 గనులతో పాటు బోయపల్లి గని మూసివేశారు. గోలేటి కేంద్రంగా ఓపెన్ కాస్ట్‌లను ఏర్పాటు చేయ తలచారు. అందుకోసం మాదారం భూగర్భగనులకు ముగింపు పలికారు. గోలేటి కేంద్రంగా బొగ్గు ఉత్పత్తికి సింగరేణి యాజమాన్యం దృష్టి సారించింది. అందులో భాగంగానే కైరిగూడ, అబ్బాపూర్ ఓపెన్ కాస్ట్‌లను తెరపైకి తెచ్చారు.
మందమర్రి ఏరియాలో అంతర్లీనమై..
ప్రస్తుతం మందమర్రి ఏరియాలో బెల్లంపల్లి అంతర్లీనమైపోయింది. పారిశ్రామిక స్వయంప్రతిపత్తిని, బొగ్గు గనుల చరిత్రను కాలదోషం పట్టించారు. సింగరేణిలో మహోజ్వలమైన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు గనులకి జీవగడ్డగా అపరఖ్యాతి కలిగిన బెల్లంపల్లికి ఇంతకంటే అవమానం మరేమికావాలని స్థానిక కార్మికులు, ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పారిశ్రామికంగా పూర్తిగా దివాలా తీసింది. కాలనీలలో ఒకప్పటి కళాత్మకత మచ్చుకు లేకుండా పోయింది.
కార్మిక వాడలు కళావిహీనంగా మారాయి. చమురు ఇంకిన గుడ్డి దీపాల వెలుగులు సైతం మసకబారి చీకట్లు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా సింగరేణికి చేసిన సేవలకు బెల్లంపల్లికి మిగిలిన ప్రతిఫలం ఎడారిగా మారడమే..! 130 ఏళ్ల సింగరేణి సంస్థ ప్రస్థాన చరిత్రలో సింగరేణికి ఊపిరిలూదిన బెల్లంపల్లిని నరనర్రాలుగా తెగనరికి సమాధి కట్టారు.
బహుముఖ వ్యూహంతో దెబ్బ
బహుముఖ వ్యూహంలో భాగంగా బెల్లంపల్లి కేంద్రంగా ఉన్న జీఎం ఆఫీసును 2001 ప్రాంతంలో గోలేటికి తరలించారు. అందులో భాగంగా బెల్లంపల్లిలోని అన్ని రకాల విభాగాలను సామూహికంగా ఎత్తివేశారు. అందులో పనిచేస్తున్న కార్మికులను గోలేటి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాలకు బదిలీ చేశారు. జనరల్ మేనేజర్ కార్యాలయం, డిపార్ట్‌మెంట్ల తరలింపు నిలుపుదల కోసం కార్మిక సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇవేమీ డిపార్ట్‌మెంట్ల తరలింపును ఆపలేకపోయాయి.
ఒక దశలో ఈ ఆందోళనలు నాటకీయంగా జరిగాయని, కార్మిక సంఘాల తీరుపై అప్పుడే విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరగా బెల్లంపల్లిలో ఉన్న శాంతిఖని కూడా మందమర్రి ఏరియాలో కలిపారు. అంతటితో ఆగకుండా యజమాన్యం మరో బొగ్గు ఉత్పత్తిలో అపారమైన కృషి సల్పిన బెల్లంపల్లిని పారిశ్రామికంగా ఉనికినీ దెబ్బతిశారు. పునర్విభజన పేరిట యావత్ బెల్లంపల్లిని మందమర్రి ఏరియాలో విలీనం చేశారు. దీంతో బెల్లంపల్లి స్వావలంబన కోల్పోయింది. బొగ్గుగనుల కల్పవల్లి బెల్లంపల్లిని ఆ తర్వాత వెలిసిన మందమర్రి ఏరియాలో విలీనం చేసి బెల్లంపల్లి చరిత్రను పతనం చేశారు.
గనుల ప్రస్థానం ఇలా..
బొగ్గు గనుల ప్రస్థానం ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైంది. బొగ్గుట్ట ఇల్లందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను తొలుత కనుగొన్నారు. ఇల్లందులో మొదలైన భూగర్భ గనుల తవ్వకాలు, అనతికాలంలోనే అక్కడ నుంచి బొగ్గు గనుల విస్తరణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వరకు చేరింది. 1928లో బెల్లంపల్లిలో బొగ్గు గనులు పురుడు పోసుకున్నాయి. తొలి బొగ్గుగని మార్గం ఫిట్ తోపాటు నెంబర్ టు ఇంక్లైన్, 85, 65 డిప్, 68, మార్గం ఫిట్, సౌత్ క్రాస్ కట్, 24, డిప్ గనులు. కాగా మలిదశ 1954లో శాంతిఖని, వివిధ రకాల డిపార్ట్‌మెంట్లూ వెలిశాయి. ఒక శాంతిగని మినహా తొలితరం గనులన్నీ బొగ్గునిక్షేపాలు అయిపోయి మూతపడ్డాయి.