27-09-2025 01:42:38 AM
మూసీ, ఈసీకి వరద ఉధృతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యాదయ్య సూచన
చేవెళ్ల/శంకర్ పల్లి, సెప్టెంబర్ 26: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ, ఈసీ నదులు పొంగిపొర్లుతున్నాయి. వీటి తో పాటు శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న వర్షానికి చిన్న చిన్న వాగులు కూడా ఉప్పొంగి పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేవెళ్ల పరిధిలోని ముడిమ్యాలకుమ్మర, రావులపల్లిమేడిపల్లి, ఆలూరు దుద్దాగు, కౌకుంట్ల తల్లారం మధ్య వాగులు పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మూసీ ప్రొద్దుటూరు వద్ద రోడ్డుపై నుంచి పారుతుండడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
మూసి వాగును పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే యాదయ్య శంకర్పల్లి బ్రిడ్జి పై నుంచి మూసి వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.