16-09-2025 12:59:46 AM
బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 15: విప్లవోద్యమానికి పుట్టినిల్లు, ఎంతో మంది విప్లవకా రులను కన్న బెల్లంపల్లి ఉద్యమాలకి జీవగడ్డగా రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. బెల్లంపల్లికి చెందిన విప్లవకారుల్లో ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. పదుల సంఖ్యలో ఉన్న విప్ల కారులు మృత్యు పరంపరలో తగ్గుతూ వస్తున్నారు. చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో బెల్లంపల్లికి చెందిన జాడి వెంకటి మృతి చెందిన విషయం తెలిసిందే.
బెల్లంపల్లి మం డలం చంద్రవల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి పుష్ప దంపతులు దశాబ్ద క్రితమే అడవి బాట పట్టారు. గ్రామంలో ఉన్నప్పుడే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి మావోయిస్టులలో చేరారు. దండకారణ్యంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేశారు. ఇటివల జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు ప్రకటించిన మావోయిస్టు మృతుల్లో జాడి వెంకటి ఉన్నారు.
మావోయిస్టు దంపతుల్లో జాడి వెంకటి మృతి చెందగా ఆయన భార్య పుష్ప ఒక్కరేమిగిలి పోయారు. దీంతో మా వోయిస్టు జంట వీడిపోయింది. వెంకటి మృతి చెందడంతో బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. గతంలో జాడి వెంకటి, పుష్ప దం పతులు అరెస్టయ్యారు. చాలా రోజులు జైల్లో నే ఉన్నారు. బెయిల్ పై విడుదలై ఇంటికి రాకుండా మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. పేద ప్రజల విముక్తి కోసం నమ్మిన బాటలో తుది శ్వాస వరకు మావోయిస్టు దంపతుల్లో ఒకరైన వెంకటి ఉద్యమంలోనే ఉండి కన్ను మూశారు.
ఒక్కరోక్కరుగా నేలకొరుగుతూ..
విప్లవానికి ఉత్పత్తి కేంద్రంగా పేరుగాంచిన బెల్లంపల్లి విప్లవోద్యమంలో ఎంతో మంది కార్మికుల బిడ్డలు అడవి బాట పట్టా రు. బెల్లంపల్లిలో సింగరేణి బాయి దొరల దాష్టికం, గుండాల ఆగడాలు, అరాచకాలకి ఎదురు తిరిగిన తొలితరం యువతి యువకులు, విద్యార్థులు తుపాకులు పట్టారు. ఉద్యోగాలు ఉన్నతమైన జీవితాలను తల్లిదండ్రులు, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజల కోసం అడవి బాట పట్టారు.
గజ్జల గంగారం, పెద్ది శంకర్, గజ్జల సరోజ పులి మదనయ్య, కటకం సుదర్శన్, గెల్లి రాయలింగు, కాసరవేణి రవి, రవీందర్ రెడ్డి, షంశీర్ ఖాన్, ఇప్ప హనుమంతు, సాంబిరెడ్డి, ఎల్తూరి రామచందర్, కుశనపల్లి ఎల్లయ్య, రాజ్ కుమార్, శనిగారపు రామచందర్, పులిపాక లక్ష్మణ్, రామకృష్ణ, కాసిపేట కృష్ణమూర్తి విప్లవోద్యమంలోకి వెళ్లి పేద ప్రజల కోసం రక్త తర్పణం చేశారు. తాజాగా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జాడి వెంకటి మృతి చెందాడు.
విప్లవోద్యమంలో కొనసాగుతున్న బెల్లంపల్లికి చెందిన మావోయిస్టుల్లో ముగ్గురే మిగిలి ఉన్నారు. సలాకుల సరోజ, జాడి వెంకటి భార్య జాడి పుష్ప, ఆరెపల్లి కృష్ణ మాత్రమే ఉన్నారు. దీర్ఘకాలిక విప్లవోద్యమం ఫలితంగా ఏర్పడిన జనతన సర్కారు విస్తరణనోద్యమానికి కోల్ బెల్ట్ ప్రాంతం నుంచి యువకులు తమ రక్తాన్ని విత్తనాలుగా దారపోస్తున్నారు.
ఈ నెత్తుటి ధార పరంపరలో బెల్లంపల్లి బిడ్డలు దండకరణ్య ఉద్యమానికి ఊపిరిలూదుతునే ఉన్నారు. త్యాగాల సాలులో బెల్లంపల్లి ఎప్పుడూ సజీవమే అని జాడి వెంకటి అమరత్వం మరోసారి రుజువు చేస్తోంది. సింగరేణి కార్మికకోద్యమ నేతృత్వంలో పురుడు పోసుకున్న పేద ప్రజల బిడ్డలు ఎంచుకున్న పోరు బాట అల పెరగడంలేదు. సాగుతూనే ఉంది.