calender_icon.png 5 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం.. రెతన్న ఆగం

05-05-2025 02:28:45 AM

  1. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో నష్టం
  2. ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సం
  3. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  4. నేలరాలిన మామిడి కాయలు

విజయక్రాంతి నెట్‌వర్, మే 4: రెండుమూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రంలో రైతన్న ఆగమవుతున్నాడు. ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సానికి చేతికొచ్చిన పంట నీళ్ల పాలవుతుండటంతో కన్నీరు పెడుతున్నాడు. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వడగండ్లు కురువడంతో రోడ్లపై, కళ్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది.

పలుచోట్ల కొట్టుకుపోయింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్, జిన్నారం మండలాల్లో ధాన్యం తడిసిముద్దయింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట, మక్కరాజ్‌పేట, పోతన్‌పల్లి, కసన్‌పల్లి, పెద్దశివునూర్ గ్రామాల్లో వడగండ్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. పంటలు అమ్ముకునే సమయంలో వడగండ్ల వాన తీరని నష్టాన్ని కలిగించిందని రైతులు వాపోతున్నారు.

సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలుల వానకు భారీ వృక్షాలు, రేకుల షెడ్లు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సిద్దిపేట పట్టణంతోపాటు కొండపాక, కుకునూన్‌పల్లి, గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్‌పూర్, చేర్యాల, మద్దూర్, సిద్దిపేట రూరల్ మండలాల్లో వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. దుద్దెట టోల్ గేట్ పైకప్పు రేకులు కూలిపోయాయి.

ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి, గాంధారి మండలాల్లో అకాల వర్షం కురిసింది. ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.