16-05-2025 12:56:49 AM
హనుమకొండ, మే15 (విజయక్రాంతి): యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2025 నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మే 25న జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం హనుమకొండ జిల్లా పరిధిలో 10 పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగిందన్నారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను 4141 మంది అభ్యర్థులు రాయనున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒక ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తను అందుబాటులో ఉంచి అవసరార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. యూపీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలన్నారు.
పరీక్ష నిర్వహించే రోజున ఆర్టీసీ బస్సులు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, డీఈఓ వాసంతి, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ మధుసూదన్ రావు, తహసీల్దార్లు, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.