calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా సంక్షోభం

11-09-2025 12:07:59 AM

  1. రైతు సమస్యలు పక్కనబెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలు
  2. రైతుల కష్టాలపై చర్చించే సమయం వారికి లేదు
  3. 8 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలున్నా రాష్ట్రానికి శూన్యమే
  4. మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో యూరియా సంక్షోభం ఏర్పడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నట్టు వ్యవహరించారని మండిపడ్డారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారని, ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం రెండు లేవని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని స్పష్టం చేశారు.

రాష్ర్టంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి ఇటీవల సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనమని తెలిపారు. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్‌రెడ్డిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాయని, పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.

కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, సరఫరాలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని, రాష్ర్టంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండం దారుణమని విమర్శించారు. బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి శూన్య హస్తాలే మిగిలాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం తప్ప చేస్తున్నదేం లేదని స్పష్టం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10శాతం తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యధావిథిగా కొనసాగించేలా ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేదంటే యూరియా కోసం రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.