11-09-2025 12:06:02 AM
-ఎల్లో ఎలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
-ఉత్తర తెలంగాణలో ప్రారంభమై.. దక్షిణ తెలంగాణకు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని, 30 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
14న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేటలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.