04-09-2025 04:33:02 PM
నల్గొండ టౌన్ (విజయక్రాంతి): ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో గురువారం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్, టాక్సికాలాజీ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులలో వివిధ రకాల పోషక పదార్థాలు, సమతుల్య ఆహారం మరియు మెరుగైన జీవనశైలి కోసం యోగా ,వ్యాయామం లాంటి విషయాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే . శ్రీనివాసరాజు మాట్లాడుతూ... విద్యార్థినులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల ప్రాముఖ్యతను వివరించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి .అరవింద మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు మన దేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటామని, ఇప్పటికీ చాలామంది పిల్లలు ,మహిళలు రక్తహీనత ,వృద్ధిలోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని, మరోవైపు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరుగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల తృతీయ సంవత్సరపు విద్యార్థినులు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, నట్స్ మొదలైన వృక్ష సంబంధిత అంశాలను ప్రదర్శిస్తూ వాటి యొక్క పోషక విలువలను చార్ట్ ల ద్వారా వివరించారు. కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రాజారామ్ మాట్లాడుతూ... ఆరోగ్యమే మహాభాగ్యం అని సమతుల్యమైన ఆహారంతో పాటు అన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని ఈ రోజుల్లో తరుచుగా వచ్చే వ్యాధులు డయాబెటిక్స్, ఊబకాయం, రక్తహీనత లాంటి వ్యాధుల బారిన పడకుండా విద్యార్థినిలు తమ యొక్క శారీరక, మానసిక ఉల్లాసానికి బాటలు వేసుకోవాలని, మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి సమాజం ఏర్పరచుకునేందుకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య భారతదేశంగా ఏర్పడే విధంగా, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి మంజుల, అధ్యాపకులు డాక్టర్ సంధ్య, డాక్టర్ సమత, డాక్టర్ సునీత, డాక్టర్ సరిత, ఆంజనేయులు, చైతన్య సుధ, సంతోష్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.