26-09-2025 01:08:50 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 25: అక్టోబర్ 9 నుంచి హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు కమిటీ, ఇనాంధార్ ముతవల్లి ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా గణనీయమైన చరిత్ర కలిగి ఉందని, ప్రతి సంవత్సరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు. అక్టోబర్ 9న గంధం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారని అన్నారు. ప్రతిసారి లాగానే ఈసారి దాదాపు నెల రోజుల పాటు ముతవల్లీలు, ఇనాంధార్లు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కన్నుల పండుగలా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ ఉత్సవాలు గంగా జమున తహజీబ్ కు నల్లగొండ హజరత్ సయ్యద్ షా లతీపుల్ల ఖాద్రి దర్గా నిదర్శనమని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ ఉర్సు ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించడం నల్లగొండ కే గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారి డి.ఈ. అశోక్, మాజీ కౌన్సిలర్ నవీన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, ఇంతియాజ్ పాల్గొన్నారు.