19-05-2025 06:40:14 PM
ప్రజావాణిలో కలెక్టర్ కి ఎమ్మార్పీఎస్ నేతల ఫిర్యాదు..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ పథకాల పేరుతో కబ్జాదారులకు భూములు అప్పగిస్తున్నట్లు బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మార్పీఎస్ నేతలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ మాదిగ, ఇతర ప్రతినిధులతో కలిసి భూకబ్జా వ్యవహారంపై ప్రజా ఫిర్యాదులో లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో, కొత్త మున్సిపాలిటీ కార్యాలయం ప్రక్కన రహదారి ఆవరణలో కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఒక కమర్షియల్ షట్టర్ నిర్మించారనీ తెలిపారు. ఈ నిర్మాణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్" ను నిర్వహిస్తు, ప్రభుత్వమే ఆ నిర్మాణాన్ని చేపట్టిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తు బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు పబ్బం గడుపుతున్నారనీ ఆరోపించారు.
ఈ అక్రమ నిర్మాణానికి, బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు కొంతమంది వ్యక్తుల నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని అనుమతులు ఇస్తున్నారనీ పేర్కొన్నారు. అంతేకాదు, మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు బద్దలు కొట్టి, వాటర్ పైప్ లైన్ వేసిన చర్యలు లేకపోవడం బాధాకమనీ వాపోయారు. ప్రభుత్వ భవన ప్రహరీ గోడను ధ్వంసం చేయడానికి అధికారికంగా అనుమతి ఎవరు ఇచ్చారు? మున్సిపల్ కమిషనర్కీ అటువంటి అధికారం ఎవరు ఇచ్చారు? అని ఆ ఫిర్యాదు పత్రంలో అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
అక్రమ నిర్మాణాల్లో మహిళలతో కిరాయిలు వసూలు చేయడం దారుణమని వివరించారు. ఈ క్రమంలోనే, ఈ అక్రమ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న దానిపై RTI ద్వారా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ, బెల్లంపల్లి ఆర్డీవో, బెల్లంపల్లి ఎమ్మార్వో ని అడగగా, తాము వాటికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, తమ వద్ద ఆధారాలు లేవని లిఖితపూర్వకంగా తెలియజేశారనీ కలెక్టర్కు విన్నవించారు.
ఇంకా ఆ షట్టర్ రహదారి పక్కనే పెద్ద వాహనాలు తిరిగే ప్రాంతంలో ఉండడం వల్ల ప్రమాదాలకు, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉందనీ తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి అక్రమ నిర్మాణాన్ని తొలగించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి అక్రమాలు ప్రభుత్వం మీద ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించే ప్రమాదం ఉంద, ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.