calender_icon.png 24 January, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో ప్రారంభమైన వాగ్గేయ వారోత్సవాలు

24-01-2026 12:00:00 AM

భద్రాచలం, జనవరి 23, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో  శ్రీ భక్త రామదాసు 393వ జయంతి వేడుకలు శుక్రవారం  ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఆలయాన్ని నిర్మించిన అపర భక్తుడు శ్రీ భక్త రామదాసు జయంతి వేడుకలు ప్రతి ఏడాది  ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా రామదాసు జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ వాగ్గేయకారోత్సవాలు నేటి నుండి ఈనెల 27వ తేదీ వరకు ఐదు రోజులపాటు సాగనున్నాయి.

ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి ఉదయం పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు నూతన వస్త్రాలను ధరింప చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త రామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ మరియు గిరిప్రదక్షిణ నిర్వహించారు.  అనంతరం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపానికి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని తీసుకువచ్చి  స్వామివారి సన్నిధిలో దాదాపు 200 మంది సంగీత కళాకారులు రామదాసు రచించిన నవరత్న సంకీర్తనలను గోష్టి గానం నిర్వహించారు.

గోష్టి గానంలో భాగంగా ముందుగా అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి,తక్కువేమీ మనకు రాముండొక్కడుండు వరకు అంటూ ముక్తకంఠంతో నవరత్నాల సంకీర్తనలను ఆలపిస్తున్నారు. అంతేకాకుండా మల్లాది బ్రదర్స్  సంగీత కచేరి కూడా పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు దంపతులు,భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్ రావు దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్త రామదాసు రచించిన నవరత్న సంకీర్తనలతో ఆలయ ప్రాంతం మారుమ్రోగుతోంది.