06-08-2024 02:03:38 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమం లక్ష్యం 50 శాతం పూర్తయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘హరితహారం’ పేరుతో మొక్కలు నాటితే, కాం గ్రెస్ ప్రభుత్వం ‘వనమహోత్సవం’ పేరుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిందే. మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రారంభించారు. అక్టోబర్ వరకు 20.02 కోట్ల మొక్కలు నాటాలని జిల్లాలకు టార్గెట్‌ను పెట్టింది. వీటిలో పురపాలక శాఖ పరిధిలో 10.09 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్, గ్రామణాభివృద్ధి శాఖ పరిధిలో 6.37 కోట్లు, అటవీశాఖ పరిధిలో 1.34 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. గత శనివారం వరకు 11.03 కోట్ల మొక్కలు నాటారు.
అంటే లక్ష్యంలో 55.12 శాతం పూర్తయింది. గత ఏడాది 19.29 కోట్ల మొక్కలు నాటారు. ఈ ఏడాది మరో కోటి మొక్కలను అదనంగా నాటాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో అలంకరణ మొక్కలకే ఎక్కువగా ప్రధాన్యం ఇచ్చారు. ఇప్పుడు భారీ వృక్షాలుగా కొన్ని ఏళ్లపాటు ఉండటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నారాయణపేట ఫస్ట్ వనమహోత్సవంలో నారాయణపేట, రాజ న్న సిరిసిల్ల జిల్లాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల్లో టార్గెట్‌కు మంచి అదనంగా మొక్కలు నాటారు. నారాయణపేటలో 11.50 లక్షల మొక్కలకు గాను 13.016 మొక్కలు నాటారు.
113.19 శాతం తో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది. 7.59 లక్షల మొక్కలకుగాను 7.76 లక్షల మొక్కలు నాటారు. ఈ జాబితాలో చివరలో హెచ్‌ఎండీఏ ఉన్నది. ఇక్కడ 7.50 కోట్ల మొక్కలకుగాను 2.05 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. అంటే లక్ష్యంలో 27.39 శాతమే పూర్తయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొంటే.. 9.35 లక్షల మొక్కలే నాటారు.
సెప్టెంబర్‌లోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 55.12 శాతం దాటింది.వచ్చే నెలాఖరులోగా (సెప్టెంబర్ ) హెచ్‌ఎండీ మినహా మిగతా జిల్లాలలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ప్రతిరోజు అన్ని శాఖలతో అధికారులు, జిల్లాల అధికారులతో సమన్వయంతో పురోగతిపై నిరంతర సమీక్ష నిర్వహిస్తున్నాం.
గోబ్రియేల్, అటవీ సంరక్షణ శాఖ ప్రధాన అధికారి