07-08-2025 11:35:40 PM
ఘట్ కేసర్: జొమాటో యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసి క్యాన్సల్ చేసిన వ్యక్తి అకౌంట్ లో నుంచి దాదాపు రూ.50 వేలు సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారం మున్సిపల్(Pocharam Municipality) వెంకటాపూర్ కి చెందిన కందుల వినోద్(32) జూన్ 30వ తేదీన జొమాటో యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆహారం ఆర్డర్ చేసి కొన్ని నిమిషాల తర్వాత ఆర్డర్ ను రద్దు చేశాడు. కానీ డబ్బు తన ఖాతాకు తిరిగి రాలేదని జూలై 2వ తేదీన ఫిర్యాదుదారుడు జొమాటో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఆ ఫోన్ నంబర్ కు డయల్ చేశాడు.
కస్టమర్ కేర్ నంబర్ ను ఒక వ్యక్తి కాల్ కు సమాధానం ఇచ్చి తాను వాట్సాప్ కాల్ చేస్తానని చెప్పి కాల్ ను కట్ చేశాడు. ఆ తర్వాత వాట్సాప్ కాల్ రాగా బాధితుడు తన ఖాతాకు డబ్బు తిరిగి రాలేదని తెలియజేశాడు. అప్పుడు నిందితుడు లింక్ పంపుతానని, ఫోన్-పే పిన్, ఖాతా నెంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయమని సూచించాడు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా వివరాలను నమోదు చేయగానే సైబర్ నేరగాడు ఒకసారి రూ.47,643/-, మరొసారి రూ.2001/- మొత్తాన్ని బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి నొక్కేశాడు. వెంటనే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోర్టల్లో అకౌంట్ నంబర్ ద్వారా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.