calender_icon.png 8 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసులు తగ్గించేందుకు కార్యాచరణ

07-08-2025 11:42:21 PM

సీఎస్ రామకృష్ణారావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు(General Secretary K. Ramakrishna Rao) ఆదేశించారు. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిజిటల్ రికార్డ్సుల నిర్వహణ, సీసీఎంఎస్ ద్వారా కేసుల పురోగతిని నిరంతరం మానిటరింగ్ చేయడం, సమాచార వ్యవస్థలో పారదర్శకతను పాటించడం, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టుతో పాటు బీహార్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలో అమల్లో ఉన్న మానిటరింగ్ వ్యవస్థను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేసేందుకు  కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సుపరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన రైజింగ్ తెలంగాణ- లక్ష్యసాధనకు ఈ సాంకేతిక వ్యవస్థ ఉపకరిస్తుందన్నారు. న్యాయ, రెవెన్యూ, హోంశాఖ విభాగాల అధికారులు ఎన్‌ఐసీతో సంప్రదించి ఆ మేరకు కార్యాచరణను వారం రోజుల్లోగా రూపొందించి నివేదికను సిద్ధంచేయాలని  ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎంఓ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.