06-08-2024 02:34:16 AM
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ మైనింగ్‌పై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రమ ఇసుక మైనింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూగర్భ, గనుల శాఖ, రెవెన్యూ, హోం, రవాణా శాఖల ముఖ్యకార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహాయ డైరెక్టర్, కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, బిచ్కుంద తహసీల్దార్లు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కుకావడంతో యథేచ్చగా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ ప్రకాష్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయమూర్తుల కమిటీ పరిశీలించాక ప్రజాహిత వ్యాజ్యంగా పరిగ ణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై సీజే బెంచ్ విచారణ చేపట్టింది.
అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రోజుకు రూ.20 నుంచి 30 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఖడ్గంశెట్లూరు శివారులోని ఆరు క్వారీల్లో ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కాలపరిమితి ముగిసింది. అయినప్పటికీ అక్రమంగా తవ్వకాలను కొనసాగుతున్నాయి.
సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మైనింగ్ జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 18 లక్షల మీటర్ల మేరకే మైనింగ్ జరిగినట్లు తప్పుగా రికార్డు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ రాసిన లేఖలో హైకోర్టుకు వివరించారు.