calender_icon.png 5 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింగంటి వేంకట నరసింహాచార్యులు

30-06-2025 12:00:00 AM

“భానుడెందాక నభ్రగతుడై జరియించు చంద్రుడెందాక తేజస్వియౌను ధరణి యెందాక నుస్థిర రూపమున జెందు గగనమెందాక నూర్ధ్వగతమొందు నుడుగణం చెందాక నడుచు హోమాద్రి పై జ్వలను డెందాక జ్వాజ్వల్యుడౌను మహిని నెందాక రామాయణంబు బఱంగు ధర విభీషణుడు నెందాక నేలు నిగమసారంబు లెందాక నెగడుచుండు భూమిభారంబు నెందాక బూనునయ్య నంతనామ ఫణీశ్వరుండంతదాక బఱగు తాలాంక నందినీ పరిణయంబు”

అంటూ ‘తాలాంక నందినీ పరిణయ’మనే శృంగార ప్రబంధం చివరలో కవి మరింగంటి వేంకట నరసింహాచార్యుల వారు చెప్పుకున్న ఈ పద్యం తన కృతి శాశ్వతత్తాన్ని తెలుపుతున్నది. మరింగంటి వారి వంశమంతా ఒక గొప్ప వైష్ణవభక్తి ప్రపత్తులు కలిగిన పండిత కుటుంబం. దాదాపుగా నేటివరకు కూడా తమ రచనలను కేవలం భగవదంకితంగానే సమర్పించిన నిష్ఠాగరిష్ఠులు.

వీరి గృహనామం ‘ఆసూరి’ అయినా రంగనాథ స్వామివారు ‘మరింగంటి’ అన్న వాక్కు కారణంగా నాటినుంచి వీరందరూ ‘ఆసూరి మరింగంటి’ వారైనారు. దాదాపుగా పలువురు మరింగంటి  కవులందరూ తమతమ రచనల్లో ఈ సందర్భాన్ని చెప్పుకున్న వారే. తమతమ కృతులద్వారా వైష్ణవభక్తి సిద్ధాంతాలను ప్రపంచానికి అందించే పనిలోనే దాదాపు ఈ వంశకవులందరూ తమ జీవితాలను పవిత్రీకరించుకున్నారు.

గణింపదగిన ఆచార్య పీఠం

నేటికీ తెలంగాణలో ఆచార్య పీఠాలలో మరింగంటి వారిదికూడా గణింపదగిన పీఠం. ఒకవైపు వైష్ణవ ధర్మ ప్రచారం చేస్తూనే పలువురు మరింగంటి కవులు అనేక కృతులను వెలయించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహామహులు. మరింగంటి అప్పల దేశికులు, మరింగంటి సింగరాచార్యులు మొదలైన వారి వరుసలో చెప్పదగిన మరో మహాకవి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. 

ఈ వంశంలోని వారు నారసింహ భక్తు లు. వేంకట నరసింహాచార్యులనే పేరు కలిగిన కవి పుంగవులు నలుగురు వున్నారు. ‘తా లాంక నందినీ పరిణయ’ కర్త అయిన వేంకట నరసింహాచార్యుల వారు మూడవ వేంకట నరసింహాచార్యులు. ‘తాలాంక నందినీ పరిణయ’ కావ్యావతారికలో తమ వంశావతార వర్ణన చేశాడు కవి. ఈ వంశవృక్షాన్ని అనుసరించి ఈయన తండ్రి భావనాచార్యులని తె లుస్తున్నది.

ఈ కవి ప్రపితామహుని పేరుకూ డా భావనాచార్యులే. ఇద్దరి ప్రతిభా పాండిత్యాలను గురించి కూడా కవి తన కావ్యా వతారికలో వర్ణించాడు. తన సోదరుడైన వెంకట రాఘవాచార్యులను గురించి, ఆయన తనపై చూపిన వాత్సల్యాన్ని గురించి, ఆయన రచించిన కేశవస్వామి శతకము గురించిన ప్రసక్తిని కూడా చేయడం వల్ల ఈ ఇరువురు సోదరుల ప్రతిభ ద్యోతకమవుతున్నది.

మరింగంటి కవుల సాహిత్యసేవను గురించి విశేష పరిశోధన చేసిన సుప్రసిద్ధ సాహితీ వేత్త శ్రీమాన్ డా. శ్రీపెరుంబుదూరు శ్రీరంగాచార్య పలు ప్రమాణాల ఆధారాలతో వెంకట నరసింహాచార్యుల (తృతీయ) వారి కాలం 1800 మధ్య కాలమని నిర్ధారించారు. ఈ నిర్ణయం చేసే సందర్భంలో డా. శ్రీరంగాచార్య ‘తాలాంక నందినీ పరిణయము’లోన చివర చెప్పిన “కలియుగ శాలివాహన శకంబులు..”

అనే పద్యాన్ని కవి సోదరుడైన, వేంకట రాఘవాచార్య కృతుల విషయాన్ని జోడించి వెంకట నరసింహాచార్యుల కాలాన్ని నిర్ణయించారు. కవి స్వయంగా తాను ‘బంధనాటక’ కృతి నిర్మాతగా తెలుపుకున్నాడు. కానీ, ‘తాలాంక నందినీ పరిణయము’ గాక ‘ఇందిరాల గోదా పారిజాతము’ అనే యక్షగాన కృతి మాత్రమే రచించినట్లు తెలుస్తున్నది.

ఆరు ఆశ్వాసాల శృంగార ప్రబంధం

1620 గద్య పద్యాలు కలిగి ఆరు ఆశ్వాసాలతో కూడిన ‘తాలాంక నందినీ పరిణయము’ శశిరేఖ వివాహ సంబంధి కథా కావ్యం. తాలాంకుడు అంటే బలరాముడు. ఆయన కుమార్తె శశిరేఖ. శశిరేఖ, అభిమన్యుల వివాహమే ఇందలి ప్రధాన ఇతివృత్తం. ఈ కథనే పలువురు తెలుగు కవులు పలు ప్రక్రియలలో రచించినా ఎవరి రచనా రీతి వారిదే కావడం విశేషం.

వేంకట నరసింహాచార్యుల వారి సమకాలీనుడైన రత్నాకరం అప్పప్ప కవి ‘శశిరేఖా పరిణయ’మనే పేరిట 997 గద్యపద్యాలు కల అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసినట్లు డా. శ్రీరంగచార్య పేర్కొన్నారు. కొన్ని సన్నివేశాలు సమానమైనవే రెండింటిలోను ఉన్నా కథా నిర్వహణకు అవసరమైన మార్పులను, చేర్పులను వేంకట నరసింహాచార్యుల వారి రచనయే చక్కగా నిర్వహించిందని సాహితీవేత్తల అభిప్రాయం.

ఇది భారతంలో కాని, హరివంశాదుల్లో కాని కనిపించని కథ. వీటిలో ఉత్తరాభిమన్యుల వివాహకథ మాత్రమే కనిపిస్తుంది. కానీ, జనశ్రుతిలోని ఈ కథ కవులను ఆకర్షించిన కారణంగా కావ్యరూపంలో వచ్చి సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నది.

ఈ కథనే కవులు మిశ్ర ప్రబంధంగా రూపుదిద్ది తెలుగు వారికి అందించారు. ‘తాలాంక నందినీ పరిణయ’ కథలో శ్రోత జనమేజయుడు కావడం, వక్త వైశంపాయనుడు కావడం వల్లనేమో ఇందులో కవి ఉత్తరాభిమన్యుల కల్యాణాన్ని కూడా కావ్యాంతంలో చెప్పాడు.

కవితాశక్తిని ప్రదర్శించిన ప్రతిభామూర్తి

‘తాలాంక నందినీ పరిణయ’ కావ్యకర్త మరింగంటి వేంకట నరసింహాచార్యుల వారు గొప్ప కవితాశక్తిని తన కావ్యంలో ప్రదర్శించిన ప్రతిభామూర్తి. శబ్దార్థాలంకారాల ప్రయోగంలో ఏ విధమైన ప్రతిభ కనబరిచాడో అనడానికి ఆయన కావ్యమే ప్రమాణం. ఇందులో అష్టాదశ వర్ణనలు ఇతర కవిత్వ పటుత్వాన్ని తెలిపే అంశాలేగాక క్రీడలు, సామాజిక ఆచార వ్యవహారాలు వంటివాటికి కూడా స్థానం కల్పించాడు కృతికర్త.

జాతీయాలు, నుడికారాల ప్రయోగం వల్ల కావ్యం సర్వసమర్థంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో నిలిచింది. ఛందో వైవిధ్యం కవికి కొత్తగా కనిపించే ద్విపాద మత్తేభము, గునుగు సీసము, పంచపాది మత్తేభము వంటివి కూడా కావ్యరచనలో ప్రవేశపెట్టి తన ప్రతిభను ఆయన నిరూపించుకున్నారు.

“ఉరుతర కందవేణి, లసదుత్పలలోచన, చంపకాంగి భా సుర తనుమధ్య, రమ్యవళిసుందర వృత్తనితంబ గీత విస్తర బహుమత్త కోకిల రసస్వర భాస్వర యైన కావ్య సుందరిని వృషాచలేశుని కుదారత గౌరత ధార వోసెదన్‌”

అని చెప్పుకున్న పద్యాన్నిబట్టి కవి తన కావ్యకన్యను వృషాచల నారసింహునికి అంకి తం చేసినట్లు స్పష్టమవుతున్నది. ఈ పద్యం లో కావ్యసుందరి వర్ణనలో ప్రయోగించిన ప్రయోగాలన్నీ శాస్త్ర సంబంధి విషయాలు మాత్రమేగాక ఒక స్త్రీ సంబంధి శబ్దాలు కూడా కావడం పరిశీలిస్తే కవి శబ్ద సంయోజన ప్రజ్ఞ మనకు అవగతమవుతుంది. దాదాపుగా కావ్యంలో చోటుచేసుకున్న అనేక పద్యాల్లో ఇటువంటి ఆలంకారిక వైభవమే దర్శనమిస్తుంది.

ద్విగుణీకృతంగా కావ్యశోభ

‘వర్ణనానిపుణః కవిః’ అన్నారు ఆలంకారికులు. ఆ విషయంలో ఆచార్యుల వారు అసమానమైన ప్రతిభ కనబరిచారు. ఈ కావ్యంలో వర్ణనలు అతిరమ్యంగా కావ్యశోభను ద్విగుణీకృతం చేయడంలో ప్రముఖమైన స్థానాన్ని అందుకున్నాయి. నిశాంత వర్ణన, వన వర్ణన, దారిద్య్ర వర్ణన వంటి పలు వర్ణనలు కవి ప్రతిభకు గీటురాళ్లు. ఒకానొక సందర్భంలో అభిమన్యుని వర్ణిస్తూ

“కనుగొని చంద్రవంశజుడు గావున తద్విధుబింబలీల యా ననమున దత్కళంక రుచి నల్లని మీసములన్, సుధారసం బును మృదువాక్కులం దరుణపుంజిగి వాతెఱ, నిండు వెన్నెలల్ తన చిఱునవ్వు నంబొలయ దాజెలు వొందె మనోహరాకృతిన్‌” 

అంటూ చెప్పిన పద్యంలో అభిమన్యుడు చంద్రవంశానికి చెందినవాడు గనుక ఆ చంద్రుడే అభిమన్యుని ముఖంగా మారిపోయాడట. అయితే, చంద్రునిలో నల్లని కళంకం ఉన్నట్లుగా అభిమన్య కుమారుని ముఖచంద్రునిలో నల్లని మీసమున్నదట. అభిమన్యుని చంద్రునితో పోల్చి చెప్పి రక్తి కట్టించాడు కవి. ఆయన చంద్రవంశ్యుడు కనుక ఇలా చంద్రునితో అభేదాన్ని కలిగించి గొప్ప ఆలంకారిక వైభవాన్ని ప్రదర్శించాడు.

ఈ కావ్యంలోని మొదటి ఆశ్వాసంలో ‘చిత్రాంగదా వివాహ ఘట్టం’ సందర్భంగా కావ్యకన్యకతో చిత్రాంగదను పోల్చి చెప్పిన తీరు హృదయంగమంగా ఉంటుంది.

“మధురవృత్తులు రీతులు, పృథుగుణములు గలుగు కూతురునకు నలంకారము లిడి పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె కవి రసజ్ఞుడు కృతినిచ్చు కావ్యమనగ”

అంటూ చెప్పిన పద్యంలో కావ్యంలో ఉన్న వృత్తులు, రీతులు, గుణములు, అలంకారములు ఉన్నవాటిని చిత్రాంగద అలంకారాల్లో కూడా ఉన్నాయంటూ రసజ్ఞుడైన వానికి కవి తన కావ్యకన్యకను ఇచ్చినట్లు, మలయధ్వజుడు తన కుమార్తెను అర్జునునికిచ్చి కన్యాదానం చేసినట్లు వర్ణించాడు.

తిరుగులేని నిబద్ధత

‘తాలాంక నందినీ పరిణయ’ కావ్యంలోని ఆరు ఆశ్వాసాల్లో గొప్ప పద్యాలు అనేకం కనిపిస్తాయి. కృతికర్త ప్రతిభకు అవి గీటురాళ్లు. కవి తనను గురించి చెప్పుకుంటూ తాను ‘పర్వత్రయ కైంకర్య నిష్ఠాగరిష్ఠుడ’నని చెప్పిన మాటలో ‘పర్వత్రయ కైంకర్యము’ అన్న మాట ఆయనలోని భగవన్నిష్ఠ, భాగవతనిష్ఠ, ఆచార్యనిష్ఠను తెలుపుతున్నది. ఈ విషయాల్లో కవికి వున్న నిబద్ధత తిరుగులేనిది.

‘తాలాంక నందినీ పరిణయమే’ దీనికి దృష్టాంతం. కావ్యాధ్యయనం చేస్తున్న సందర్భంలో అడుగడుగునా ఈ నిష్ఠాత్రయం పాఠకుని అనుభూతిలోకి వస్తుంది. ఇందులోని వర్ణనలు కవి ప్రతిభను దర్శింపజేసేవేగాక, మరింగంటి కవుల పరంపరలో తమదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న కవిగా తనను తాను నిరూపించుకున్న కవిగా, ఘనతను చాటుకున్న కవీశ్వరుడు ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు.