30-06-2025 12:00:00 AM
‘మనిషి జీవితంలో చివరికి మిగిలేది ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం ‘శూన్యం’. శూన్యం అంటే ఏమీ లేదని అర్థం. మనిషి మరణానంతరం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చివరకు మిగిలేది ఏమీ లేదని తెలిసినా, మనిషికి డబ్బుకోసం ఎందుకింత వెంపర్లాట? పోయేటప్పుడు తనతో ఎవరూ రారని తెలిసినా, నా వాళ్లు అంటూ ఎందుకింత ఆరాటం? ‘మనిషి మరణానంతరం చివరికి మిగిలేదేమిటి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.
ఈ విషయం అర్థం కావాలంటే, ఫిజిక్స్ అరుణ్ కుమార్ కవితా సంపుటి ‘శూన్యం’ తప్పక చదవాల్సిందే. ఇందులో మొత్తం 58 కవితలు ఉండగా, ప్రతీ కవిత సామాన్య పాఠకులకు అనురక్తి కలిగించేలా ఉన్నాయి. ఒక్కో కవిత తీరు, మృదుమధురమైన పదప్రయోగం వర్ణనాతీతం. పాఠకులను మంత్రముగ్ధులను చేసే సైన్స్ పదాలతో కవితలు రాయడమంటే అది ఈ కవికే మాత్రమే సాధ్యమేమో.
‘చరితకు నువ్వే ఓ ట్యాగ్ లైన్’ కవిత ద్వారా నేటి యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. నిరంతర సాధన చేసిన వారికి మాత్రమే విజయం స్వాగతం పలుకుతుంది. ‘నానమ్మ పెంచిన ప్రాణాలే’ కవితద్వారా పాఠకులు తమ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటారు. ‘ప్రయివేటు టీచర్’ కవితలో గురువు గొప్పతనం చెప్పారు.
అజ్ఞానంపై అక్షర సమరం చేస్తున్న గురువులను ప్రయివేటు టీచర్, ప్రభుత్వ టీచర్ అని రెండు పాయలుగా చీల్చడం తగదన్నారు. ‘అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది’ కవిత దేశ రక్షణలో సైనికుడి విలువను గొప్పగా తెలియచెప్పింది.
ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. కవిత్వాన్ని పాఠకులు చివరిదాకా వదలకుండా చదువుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చమత్కారమైన పద విన్యాసాలు తప్పనిసరిగా ఆకట్టుకుంటాయి. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు ఈ కవి కలం నుంచి జాలువారాలని కోరుకొందాం.
శూన్యం (కవిత్వం), ఫిజిక్స్ అరుణ్‌కుమార్,
పేజీలు: 144, జె.ఎస్. ప్రచురణలు, వెల: రూ.220/
ప్రతులకు: కవి చిరునామా
పి.అరుణ్‌కుమార్, s/o సుబ్బయ్య, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,
తెలంగాణ 509209,
సెల్: 9394749536