05-11-2025 10:58:04 PM
బెంగళూరు: ఊహించినట్టుగానే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) అమ్మకానికి రెడీ అయింది. త్వరలోనే ఆ ఫ్రాంచైజీకి కొత్త యాజమాన్యం రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఆర్సీబీ ఫ్రాంచైజీ అమ్మకానికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ పెరగడంతో యాజమానిగా ఉన్న డియోజియో అమ్మేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత రెండు మూడు నెలలుగా ఈ వార్తలు వస్తున్నా కూడా ఆర్సీబీ ఓనర్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దాదాపు 17 వేల కోట్ల వరకూ వారు డిమాండ్ చేయడంతో కొన్ని కంపెనీలు వెనకడుగు వేసినట్టు తెలిసింది.
అయితే ఆర్సీబీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచంలో కార్పొరేట్ దిగ్గజాలే కొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే 17 ఏళ్ళు టైటిల్ గెలవకున్నా ఎప్పటికప్పుడు ఆర్సీబీ క్రేజ్, బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు డియాజియో(Diageo) భారీ ధర చెబుతున్నా కొనేందుకు 6-7 కంపెనీలు రేసులో ఉన్నట్టు తెలిసింది. గతంలో కింగ్ ఫిషర్ యునైటెడ్ స్పిరిట్స్ నుంతి డియోజియో ఆర్సీబీని కొనుగోలు చేసింది. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్సేంజీకి తమ ఫ్రాంచైజీ అమ్మకానికి సంబంధించి సమాచారమివ్వడంతో ఆర్సీబీ ఫర్ సేల్ ఖాయమైంది. దీంతో అమ్మకం ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 లోపు ముగించేలా డియోజియో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఈ లోపు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించే కంపెనీలతో చర్చలు జరిపి ఫైనల్ రేటును ఫిక్స్ చేసుకోనుంది. దీంతో ఐపీఎల్(IPL)లో ఆర్సీబీతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్ళిపోనుంది. కాగా ఆర్సీబీ ఫ్రాంచైజీ కోసం విదేశీ కంపెనీలే కాకుండా భారత్ కార్పొరేట్ దిగ్గజాలుగా ఉన్న అదానీ గ్రూప్, జిందాల్ గ్రూపు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. అయితే ఈ టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసే క్రమంలో విక్టరీ పరేడ్ నిర్వహించగా తొక్కిసలాట జరిగి బెంగళూరు స్టేడియం దగ్గర 11 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో వచ్చే ఐపీఎల్ నుంచి చిన్నస్వామి స్టేడియాన్ని ఆర్సీబీకి హోం గ్రౌండ్ గా కేటాయించకపోవచ్చని సమాచారం.