22-12-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం, డిసెంబర్ 21, (విజయక్రాంతి) క్రీడలలో గెలుపోటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన నిరుత్సహపడకుండా పట్టుదలతో ఆడి గెలిచే అంతవరకు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం వరిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్రీడాకారులకు సూచించారు. ఆదివారం నాడు భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో భద్రాచలం ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో మూడోసారి నిర్వహిస్తున్న 7-ఏ-సైడ్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచించారు.
క్రీడాకారుడు బరిలో దిగేటప్పుడు గెలుస్తామనే ధీమాతో జట్టును సక్రమమైన పద్ధతిలో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఆట ఆడితే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని, గెలిచిన జట్టు ఓడిన జట్టుకు ప్రశంసించి గెలవడానికి ప్రయత్నించాలని హితబోధ చేయాలని అన్నారు. అలాగే ఫుట్బాల్ క్రీడ మాత్రమే కాకుండా అన్ని క్రీడలలో మక్కువ పెంచుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలని అన్నారు.
భద్రాచలంలోని ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడలలో సాధన చేయడానికి మరియు జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా క్రీడలకు సంబంధించిన స్టేజి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్మాణానికి కృషి చేస్తానని, ఈనెల 26 నాడు జరిగే జిల్లా స్థాయి క్రీడలకు పూర్తి సహకారం అందిస్తానని అలాగే ఫుట్బాల్ క్రీడలు ప్రాచుర్యంలో రావడానికి భద్రాచలం క్లబ్ సభ్యులు యువకులను గుర్తించి వారికి ప్రతిరోజు ఫుట్బాల్ క్రీడలు ఆడిపించాలని అన్నారు. అనంతరం అండర్ 14 అశ్వాపురం ఫుట్బాల్ క్రీడలు ప్రారంభించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.అనంతరం క్రీడాకారులకు ఫుట్బాల్ క్రీడా పరికరాల చెట్లను మరియు క్రీడా దుస్తులను అందించారు.ఈ కార్యక్రమంలో చందు, సలీం, మన్మధ, రాజు,GV రామిరెడ్డి,GS శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.