30-10-2025 01:41:07 PM
మంత్రి జూపల్లి నియోజకవర్గంలో ఘటన
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కొల్లాపూర్ మండలంలోని రాంపురం పశువుల వాగు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆకునమోని చంద్రయ్య యాదవ్ అనే గ్రామస్థుడు గురువారం వాగు మధ్యలో కూర్చొని ప్రత్యేక నిరసన చేపట్టాడు. వర్షాకాలంలో వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు వ్యవసాయ పనులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతి ఏటా వాగు దాటడంలో ప్రమాదాలు ఎదుర్కొంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం లోని చాలా ఏళ్లుగా ఈ సమస్య దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాకపోవడంతో వాగులో కూర్చోవడం తప్ప మరో మార్గం లేదని నిరసనకారుడు తెలిపారు. గ్రామస్థుల సమస్యను పరిష్కరించి శాశ్వత బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.