calender_icon.png 1 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములు, వాగు ఆక్రమణలపై అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు

31-10-2025 07:01:53 PM

చివ్వెంల: చివ్వెంల మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములు, వాగులు, నాలాలు కబ్జాలకు గురవుతుండగా, తక్షణమే వాటిని గుర్తించి పరిరక్షించాలని గ్రామస్థులు మండల తహసిల్దార్ జి. చంద్రశేఖర్, మండల ప్రజా పరిషత్ అధికారికి శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ... గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రామంలో పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాగులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవడంతో వర్షపు నీరు నిలిచిపోయి గ్రామంలోని పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

ఇళ్లలోకి నీరు చేరడంతో చిన్న పిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడే ప్రమాదం నెలకొన్నదని పేర్కొన్నారు. గతంలో మన్నా చర్చి వెనుకభాగంలో ఉన్న చిన్న వాగును సమీప భూస్వాములు ఆక్రమించడంతో సహజ నీటి ప్రవాహం అడ్డంకికి గురైందన్నారు. ఫలితంగా పైభాగంలో ఉన్న రైతుల పొలాలకు నీరు చేరక, భారీ వర్షాల సమయంలో గ్రామంలోని ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు.

చివ్వెంల రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, పాత వాగులు, దేవదాయ భూములు గత కొంతకాలంగా క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని వారు ఆరోపించారు. నక్షా ఆధారంగా ఈ భూములను గుర్తించి వాటిని పరిరక్షించాలని అధికారులను, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.