calender_icon.png 18 November, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుభీర్‌లో విఠలేశ్వర జాతర సందడి

18-11-2025 07:28:35 PM

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయం మరో పండరీపురంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ నెల 11న ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ మంగళవారం ఘనంగా ముగిసింది. తెల్లవారుజామున రుక్మిణి–విట్టల విగ్రహాలకు అభిషేకం, పుష్పార్చన, పట్టువస్త్రాల సమర్పణ అనంతరం కన్నుల పండుగగా కాకడ హారతి నిర్వహించారు. తరువాత ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామివారిని భజనలు, మేళతాళాలతో పురవీధుల గుండా ఊరేగించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పరమేశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలా కీర్తన’ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విశేషంగా తులసి మాల ధారణ చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ జాతరలో మొత్తం 32 క్వింటళ్ల అన్నదానం భక్తులకు పంపిణీ చేయబడింది. ఈ మహత్తర సేవను గ్రామంలోని మున్నూరుకాపులు మరియు యాదవులు కలిసి నిర్వహించడం విశేషం.

భక్తుల సందడి మధ్య అన్నదాన కార్యక్రమం ఘనంగా సాగింది. జాతర సందర్బంగా మహారాష్ట్ర, నిర్మల్ జిల్లా వివిధ మండలాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చిన్నారులను ఆకట్టుకునే వినోద పరికరాలు, రంగులరాట్నం జాతరలో ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విట్టల్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ పెంటాజీ, మున్నూరుకాపు–యాదవ సంఘాల అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, ఆయా గ్రామాల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు.