10-11-2025 01:41:26 AM
భోపాల్, నవంబర్9 : ఓట్ల చోరీని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ సర్కార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితా(సర్)ను తెరమీదకు తెచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఓట్ల చోరీ ఒక్క హర్యానాలోనే కాదని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, వాటిని బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, బీహార్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఈసీ భాగస్వామ్యంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
దేశ విభజనకు కుట్ర
బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఓట్ల చోరీని అడ్డుకుంటే దేశంలో వంద శాతం ఇండియా కూటమిదే అధికారమని తెలిపారు. మోదీ, అమిత్‌షాలు దేశంలో ఎక్కడికి వెళ్లినా చివరకు ఓట్ల చోరీ విషయంలో దొరికి పోతారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఓట్ చోరీని అడ్డుకునేందుకు యువత, రైతులు, కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.