23-07-2025 12:00:00 AM
మేకల ఎల్లయ్య :
‘ప్రభుత్వాన్ని కోర్టుకు గుంజితేనే సజావుగా పాలన సాగుతుం ది’ అని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను, అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలే సార్వభౌములు, వారే రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కుతో నాయకులను ఎన్నుకుంటారు.
ఎన్నికయ్యాక నాయకులు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా, సమస్యలను పరిష్కరించుకుండా ఉంటే ఏం చేయాలి ? దశా బ్దాలుగా ప్రజాస్వామ్యాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. ప్రజలే ప్రభువులైతే, వారు ఎన్నుకున్న నాయకులను నియంత్రించే అధికారాన్ని కోర్టులకు ఎందుకు వదలాలి? ఇక్కడే ‘రీకాల్ చట్టం’ ఆవశ్యకత కనిపిస్తుంది.
ఓటరు కేవలం ఓటు వేయడమే కాదు, పని చేయ ని నాయకుడిని పదవి నుంచి తొలగించే అధికారం కూడా ప్రజలకే ఉండాలి. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన గీటురాయి. ఎన్నికల ముందు తప్పుడు హామీ ఇచ్చి, ఓటర్లను మోసం చేసి, ఎన్నికల్లో గెలిచి, చివరకు ఆ ఓటర్ల సమస్యలు పరిష్కరించని నాయకుడు ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగాలి?
అధ్యయనాల ప్రకారం..
భారతదేశంలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో సగటున 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వీరు ఎన్నుకున్న వారే ఎంపీలు, ఎమ్మెల్యేలవుతారు. అయితే, వీరిలో మెజా ర్టీ నాయకులు ప్రజల కోసం పెద్దగా పనిచేయరనే విమర్శలు, ఆరోపణలు ఉన్నా యి.
వాటిని బలపరిచేలా 2019లో ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెలుగులో కి వచ్చాయి. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 43 శాతం (233 మంది) మందిపై క్రిమిన ల్ కేసులు ఉన్నాయి. వీరిలో 29 శాతం (159 మంది)పై హత్య లేదా హత్యాయ త్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యాలు వంటి క్రిమినల్ కేసులు నమోద య్యాయి.
అలాగే రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే తంతు. ఉదాహ రణకు, 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన 403 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది (40 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
2018లో దేశవ్యాప్తంగా ఓ సంస్థ జరిపిన ఒక సర్వేలో దేశవ్యాప్తంగా 54 శాతం మంది ఓటర్లు ‘ఎన్నికల తర్వాత మా ఎమ్మెల్యే మాకు కనిపించడం లేదు’ అని వాపోయారు. 2018 లో ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయ నం ప్రకారం.. భారతదేశంలో కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజలకు 55 శాతం మాత్రమే విశ్వసనీయత ఉంది.
చాలాచోట్ల ‘రీ కాల్’ సక్సెస్
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పంచాయతీ స్థాయిలో రీకాల్ విధానం అమలవుతున్నది. మధ్యప్రదేశ్‌లో 2017 లో 377 మంది సర్పంచ్‌లపై రీకాల్ వేయ గా, విచారణ అనంతరం 250 మందికి పైగా సర్పంచ్‌ల పదవులు పోయాయి. ఇది స్థానిక స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఒడిశాలో 2019లో 70 మందికి పైగా సర్పంచ్‌లను ప్రజలు రీకాల్ చేశారు.
మరి ఇదే రీ కాల్ హక్కు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఎందుకు వర్తించదు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధు లు జవాబుదారీగా ఉండడానికి ఇదే అత్యంత ప్రభావశీలమైన మార్గం. అమెరికాలోని 19 రాష్ట్రాలో రీకాల్ విధానం అమలులో ఉంది. అక్కడి ప్రజలు గవర్న ర్లు, సెనేటర్లు, న్యాయమూర్తులను సైతం రీకాల్ చేయవచ్చు. 2003లో కాలిఫోర్నియాలో ప్రజలు గవర్నర్ గ్రే డేవిస్‌ను రీకా ల్ చేశారు.
తర్వాత అదే స్థానంలో నటుడు ఆర్నాల్డ్ ష్వార్జనెగ్గర్‌ను గవర్నర్‌గా ఎన్నుకున్నారు. అలాగే స్విట్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజా స్వామ్యానికి మంచి ఉదాహరణ. అక్కడి ప్రజలు రీకాల్ హక్కును కలిగి ఉండడమే కాకుండా, ప్రజలు సైతం శాసనాలను నేరు గా ప్రతిపాదించవచ్చు, లేదా రద్దు చేయవ చ్చు. 2017లో నాటి ప్రభుత్వం తైవాన్‌లో రీకాల్ చట్టాలను సరళీకరించింది.
కొత్త సవరింపు ప్రకారం.. గతంలో రీ కాల్‌కు ఓటర్లలో 50 శాతం మద్దతు అవసరం కాగా, ఇప్పుడు కేవలం 25 శాతం ఉంటే చాలు. భారత్‌లోనూ 1970ల ప్రాంతంలో జయప్రకాశ్ నారాయణ (జేపీ) తన సం పూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా ‘రైట్ టు రీ కాల్’ అమలు చేయాలని ప్రతిపాదించారు. 1999లో భారత ఎన్నికల కమిషన్ ఈ విషయంపై పరిశీలనకు సైతం సిఫార్సు చేసింది. 2020లో ఢిల్లీ శాసనసభలో కూడా రీకాల్ బిల్లుపై చర్చ జరిగింది.
వెనుకడుగు ఎందుకు?
రీ కాల్ చట్టం వస్తే, నాయకులు ఐదేం డ్లు ప్రజల కంటికి కనపడకుండా, తమ పనిని నిర్లక్ష్యం చేయలేరు. వారు కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందే. వారి సమస్యలు విని, పరిష్కరించాల్సిందే. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలి. ఇవ న్నీ నాయకులకు ఇష్టం ఉండదు కాబట్టే, రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని తెచ్చేందుకు వెనకడుగు వేస్తాయి. అన్ని విధాలా రీ కాల్ చట్టం చేయడమే అత్యత్తుమని, రీ కాల్ అమలవుతున్న దేశాలను చూస్తే మనకు అర్థమవుతుంది.
ఆ వ్యవస్థ ను కాదని, భారత పౌరులు న్యాయవ్యవస్థను ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి? దేశంలో ఇప్పటికే దాదాపు 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నా యి. ఈచొప్పున ఉదాహరణకు ఒక పౌరు డు ఒక ప్రజాప్రతినిధిపై కేసు వేస్తే, దాని విచారణ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పు డు తుది తీర్పు వస్తుందో తెలియని పరిస్థితి. పైగా ఖర్చుతో కూడుకున్నది.
భారతదేశానికి ‘రీ కాల్’ కరెక్ట్
భారత్‌లో ప్రజాప్రతినిధుల పనితీరుపై సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేదు. వారి నియంత్రణపైనా అదే ఫిర్యాదు ఉంది. రీ కాల్ విధానం అమలైతే ప్రజలే తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై నిరంతరం పర్యవేక్షించవచ్చు. తద్వారా నాయకుల్లో నూ జవాబుదారీతనం వస్తుంది. ప్రజాప్రతినిధులు చేసే అవినీతి తగ్గుతుంది. ప్రజలకు పారదర్శక పాలన అందుతుంది. పనిచేయని లేదా అవినీతిపరులైన నాయకులను రీ కాల్ ద్వారా, మళ్లీ నియమించు కునే అవకాశం కలుగుతుంది.
రీ కాల్ విధానాన్ని అమలు చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ప్రజలు రీ కాల్ పిటిషన్లను తరచుగా దాఖలు చేస్తే ఎన్నికల ప్రక్రియ నిరంతరంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చు. ప్రతి రీ కాల్ ఎన్నికకు భారీగా నిధులు అవసరమవుతాయి. కొందరు ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకొని, నిరాధారమైన ఆరోపణలతో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం.
అలాగే అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఎన్నికైన నాయకులపై ఆపై వర్గాలు అనవసరంగా రీకాల్ పిటిషన్లు దాఖలయ్యే ప్రమాదం ఉందని ఇంకొందరి అభిప్రాయం. అయితే, ఇవేమీ పెద్ద సమస్యలు కాదు. ఈ సవాళ్లను అధిగమించడానికి, రీ కాల్ విధానాన్ని అమలు చేసేటప్పుడు, నిర్దిష్ట నియమ నిబంధనలు, కఠినమైన ప్రక్రియలు రూపొందించడం అవసరం.
ఉదాహరణకు, ఒక రీ కాల్ పిటిషన్‌కు కనీ సం.. ఆ నియోజకవర్గంలో 30 నుంచి- 40 శాతం మంది ఓటర్లు సంతకాలు అవసరమనే నియమం పెట్టవచ్చు. ఆపై నిర్వహిం చే రీ కాల్ ఎన్నికలో ఓటర్లలో కనీసం 50 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొని, మెజారిటీ ఓట్లు రీ కాల్‌కు మద్దతిస్తేనే నాయకుడిని తొలగించాలి. అలాంటి నిబంధనలు రీకాల్ ప్రక్రియను దుర్వినియోగం కాకుండా నిరోధించగలవు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో శక్తిమంతమైనది. అయితే, ఆ ఓట్లతో గెలిచినంత మాత్రాన, ఆ ప్రజాప్రతినిధి ఐదేండ్లు పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. సదరు నాయకుడు పని చేయలేకపోతే, ప్రజలే తిరిగి న్యాయం చేయగలిగి ఉండాలి. ఇది కోర్టుల పని కాదు. ప్రజల హక్కు. రీ కాల్ అంశంపై జాతీయ న్యాయ కమిషన్ కూడా చర్చలను ప్రారంభించింది.
సవాళ్లను అధిగమించి, సరైన నిబంధనలతో రీ కాల్ చట్టాన్ని అమలు చేస్తే, అది భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది. తద్వారా ప్రజలు కోర్టులకు వెళ్లి పిటిషన్లు దాఖలు చేయకుండా, ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగకుండా తమకు నచ్చని నాయకుని పదవిని తామే తీసేసే వ్యవస్థ వస్తుంది.