24-07-2024 12:27:37 AM
హైదరాబాద్ సిటీబ్యూరో/రాజేంద్రనగర్, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుంటే నగర శివారులోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉన్న జంట జలాశయాలు అయిన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట చెరువు)లలోకి మాత్రం నీరు రావడం లేదు. నగరవాసుల దాహార్తిని తీర్చే ఈ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరడంలేదు. హుస్సేన్‌సాగర్‌లోకి వరద రావడంతో అధికారులు ఇటీవల తూముల గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. కానీ జంట జలాశయాల్లో అందు కు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. వర్షాలు కురుస్తున్నా ఈ రిజర్వాయర్లలోకి నీరు చేరడం లేదు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవకపోవడంతో పాటు జలాశయాలకు వరద వచ్చే కాల్వలు ఆక్రమణలకు గురి కావడం కూడా కారణమని ఆరోపణలున్నాయి. భారీ వర్షాలు కురిస్తే కానీ జలాశయాలు నిండే పరిస్థితి కనిపించడం లేదు.
మూసీ, ఈసీ వాగుల్లో నీరేది?
ప్రధానంగా హిమాయత్‌సాగర్ చెరువులోకి ఈసీ వాగు ద్వారా నీళ్లు వచ్చి చేరుతాయి. ఈ చెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ ఇదే. వికారాబాద్ జిల్లాలోని పరిగి, పూడూరు మండలాలతో పాటు షాబాద్, మొయినాబాద్ మండలం, శంషాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిస్తే ఆ నీరు ఈసీ వాగు ద్వారా హిమాయత్ సాగర్‌కు చేరుతుంది. ఈసీ వాగుతోపాటు ఇతర చిన్నాచితక వాగుల ద్వారా కూడా నీరు ఈ చెరువులోకి వస్తుంది. అయితే, హియాయత్ సాగర్ చెరువు ఎగువ ప్రాంతాల్లో ఇప్పటివరకు భారీ వానలు కురిసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు కురిసిన చిన్న వానలు పంటలకే సరిపోయాయి.
గండిపేటదీ అదే పరిస్థితి
గండిపేట చెరువులోకి ప్రధానంగా మూసీ నది ద్వారా నీళ్లు వస్తాయి. మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టలో జన్మించింది. వికారాబాద్, మోమిన్‌పేట మండలంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిస్తే నీళ్లు మూసీ నదిలో ప్రవహించి ఉస్మాన్‌సాగర్‌కు వచ్చి చేరుతాయి. మూసీతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా కూడా నీరు వస్తుంది. ఆయా ప్రాంతాల్లో వర్షం అంతంతే కురవడంతో నీళ్లు రావడం లేదు.
ప్రస్తుతం నీటి నిల్వలు ఇలా..
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు నిండాలంటే ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, తాండూరు, అనంతగిరి, శంకర్‌పల్లి, షాబాద్ మీదుగా గండిపేటకు వరద రావాలి. ప్రస్తుతం వరద రాని కారణంగా జంట జలాశయాల్లో నామమాత్రపు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్ నీటి సామర్థ్యం 3.900టీఎంసీలు కాగా మంగళవారం నాటికి 1.885టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 2.980టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. హిమాయత్‌సాగర్‌లో 2.970టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 1.701టీఎంసీల నీళ్లున్నాయి. గతేడాది ఇదే సమయానికి 2.650టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
వర్షాభావ పరిస్థితులు.. పలు చోట్ల ఆక్రమణలు..
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరద రావాలసిన ఎగువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మోస్తరు వర్షం కురుస్తున్నా వరద రావడం లేదు. వికారాబాద్ జిల్లాలో ఈ నెలలో కురిసిన వర్షాలు నామమాత్రమే. ఆ జిల్లాలో 16.1మి.మీ. వర్షమే అత్యధికం. రంగారెడ్డి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలే కురిశాయి. ఇదొక కారణమైతే.. వరద కాల్వల ఆక్రమణలు కూడా జంటజలాశయాల్లోకి నీరు రాకపోవడానికి కారణమవుతున్నాయి. గండిపేట, శంకర్‌పల్లి, శంషాబాద్, వికారాబాద్, తాండూరు మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు వరద వచ్చే కాలువలను, పరిసర ప్రాంతాల్లోని భూములు ఆక్రమణకు గురై, నిర్మాణాలు వెలిశాయి. దీంతో వరద నీరు ఈ జలాశయాల్లోకి రావడం లేదు. జంటజలాశయాల రక్షణ కోసం ఉన్న జీవో 111ను గతేడాది ఎత్తివేయడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి.