19-08-2024 12:00:00 AM
కాగ్నిజెంట్ వివరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఫ్రెషర్లకు రూ.2.52 లక్షల వార్షిక జీతాన్నే ఆఫర్ చేస్తున్నదంటూ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌పై సోషల్ మీ డియా నిరసనలు వెల్లువెత్తడంతో ఆ కంపెనీ ఆదివారం ఒక వివరణ ఇచ్చింది. ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తాము రూ.4-12 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లిస్తున్నామని, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వేతనం నాన్-ఇంజినీరింగ్ డిగ్రీ హోల్డర్లకని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. అలాగే వార్షిక వేతనం పెంపు కేవలం 1 శాతమేనంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ వ్యక్తిగత పనితీరు ఆధారంగా 1-5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు ఇస్తున్నామని, ఆ శ్రేణిలో లోయర్ బ్యాండ్‌ను కోట్ చేస్తూ వార్తలు వెలువడ్డాయని వివరించారు.
క్యాంపస్‌ల్లో రిక్రూట్ చేసుకున్న నాన్-ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్, మూడేండ్ల అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే రూ.2.52 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నామని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షిక వేతనాల్ని ఆఫర్ చేస్తున్నట్టు గుమ్మడి వెల్లడించారు. నాన్ ఇంజనీరింగ్ అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీహోల్డర్లను అడ్మినిస్ట్రేటివ్, ఇతర ఉద్యోగాలకు తీసుకుని, వారి స్కిల్స్‌ను మెరుగుపర్చడానికి, ఐటీ ట్రైనింగ్‌పై డబ్బును, సమయాన్ని భారీగా పెట్టుబడి చేస్తామని, అటుతర్వాత వివిధ రోల్స్‌లో నియమిస్తామని వివరించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలోనే ఉత్తమమైన ప్యాకేజ్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 3,36,000 కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇండియాలోనే పనిచేస్తున్నారు.