13-01-2026 02:52:44 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 12 (విజయక్రాంతి): ప్రతి నిరుపేద ఇంటికి ప్రతిరోజు సంక్షేమ పథకం అందిస్తున్న ఏకైక ప్రజాపాలన ప్రభుత్వమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రతీకగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ నగరంలోని విద్యుత్తు సౌధ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు ప్రశంసాపత్రం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్దిదారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ పథకాన్ని సార్థకం చేసినందుకు ప్రతి ఒక్క లబ్దిదారుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ జ్యోతి పథకం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గిస్తూ వారి నెలవారీ ఖర్చులను గణనీయంగా తగ్గించిందని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ఇంటి ఆర్థిక స్థిరత్వం పెరిగిందని, పిల్లల చదువులు, మహిళల గృహ నిర్వహణ, చిన్న వ్యాపారాలకు ఈ పథకం ఎంతో దోహదపడుతోందని వివరించారు. గృహ జ్యోతి పథకం కేవలం ఒక పథకం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతిరూపమని పేర్కొన్నారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఇటువంటి సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల తమకు లభిస్తున్న ఆర్థిక ఊరటపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఇ పి.వి.రమేష్, ఎస్ ఇ. బీమా నాయక్, డి.ఇ. లక్ష్మణ్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సిజే బెనహార్ పాల్గొన్నారు.