14 April, 2026 | 4:18 AM

తడిసిన వడ్లు కొంటాం

09-05-2024 02:00 AM

మద్దతు ధర ఇస్తాం

అన్నదాతలు అధైర్యపడొద్దు

కర్ణాటక నుంచి ౨.౨౫ టీఎంసీల నీళ్లు

మేడిగడ్డపై పదిరోజుల్లో నివేదిక 

మంత్రులు ఉత్తమ్‌కుమార్,  తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్/ఖమ్మం, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం మొత్తాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. తడిసిన ధాన్యానికి ఎఫ్‌సీఐ ధర తగ్గించినా.. తగ్గిన ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రభుత్వం అత్యవసర అంశంగా పరిగణిస్తోందని చెప్పారు. మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది ఇదే సమయానికి 13.77 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఇప్పుడు 24.85 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు.

గతంలో కంటే ఈసారి రెట్టింపు ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడునాలుగు రోజులకు డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. తాగునీటి కోసం సీఎంతో పాటు తాను కర్ణాటక ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేయగా..  నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి 2.25 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో  మాట్లాడారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందని, పూర్తి నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. వారంపది రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని 

 వెల్లడించారు. అధైర్యపడవద్దు: తుమ్మల

అకాల వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులు అధైర్యపడవద్దని మంత్రి తుమ్మల కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని.. ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చినట్టుగా పంద్రాగస్టు లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. కాగా, గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.

ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తీరా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పనికిరాకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. తడిచిన ధాన్యం కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. బుధవారం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్‌లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు మొక్కా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన కిసాన్ కాంగ్రెస్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  ఈ సమావేశానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు.  కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,  రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగులసంస్థల చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.